తెలంగాణ

telangana

ETV Bharat / state

lockdown effect on kids : కన్నవాళ్లను బూచోళ్లుగా చూస్తోన్న పిల్లలు

కరోనా వల్ల రెండేళ్లుగా పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇల్లు, ఆన్​లైన్ క్లాసులు, మొబైల్ ఫోన్​లో గేమ్స్​, టీవీ, అమ్మానాన్న తప్ప వారికి వేరే వ్యాపకం లేకుండా పోయింది. స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్దామంటే.. నిరాకరిస్తున్న తల్లిదండ్రులు. ఆన్​లైన్ తరగతుల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్న పిల్లలు.. వారి తల్లిదండ్రులు కాస్త మందలించినా.. వారికి వ్యతిరేకంగా మారుతున్నారు. తల్లిదండ్రులపై కోపం తెచ్చుకుంటున్నారు.

lockdown effect on kids
కన్నవాళ్లను బూచోళ్లుగా చూస్తోన్న బాల్యం

By

Published : Jul 30, 2021, 8:52 AM IST

" మా అమ్మంటే కోపం వస్తోంది. ఆన్‌లైన్‌ క్లాసులు అర్థం కావట్లేదంటే వినట్లేదు. నిద్ర వస్తుందన్నా పట్టించుకోవట్లేదు. తలనొప్ఫి. చిరాకుగా ఉంటోంది. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుంది. అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లినా అమ్మ మాట వినమంటారు. నా బాధ ఎవరూ పట్టించుకోవట్లేదు."

- 6 వ తరగతి విద్యార్థిని ఆక్రందన

గ్రేటర్‌ హైదరాబాద్​లోని చిన్నపిల్లల కౌన్సెలింగ్‌ సైకాలజిస్టుల వద్దకు వచ్చిన వాటిలో పై ఉదాహరణ ఒకటి. బిడ్డలు ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో క్రమశిక్షణ పేరుతో అతిగా ప్రవర్తిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని హెచ్చరిస్తున్నారు మనస్తత్వ నిపుణులు. పిల్లలను తల్లిదండ్రులు దండించినా, కోపగించుకున్నా ఇటువంటి వ్యతిరేక భావనలే వారిలో కలుగుతుంటాయి. ఎదిగేకొద్దీ వారిలో అభిప్రాయాలు మారుతుంటాయి.

కరోనా మహమ్మారితో లక్షలాది మంది చిన్నారులు ఇంటికే(lockdown effect on kids) పరిమితమయ్యారు. ఆన్‌లైన్‌ చదువులతో సెల్‌ఫోన్‌ చేతికొచ్చింది. సైకాలజిస్టు సంస్థ సర్వే ప్రకారం గతేడాది ఆన్‌లైన్‌ తరగతులకు హాజరైన విద్యార్థుల్లో 50 శాతం మంది పాఠాలు వినేందుకు నిరాసక్తత ఉన్నట్టు గుర్తించారు. పాఠ్యాంశాలు అర్థంగాక మానసిక ఒత్తిడికి గురైనట్టు తాము గమనించామని కౌన్సెలింగ్‌ నిపుణులు డాక్టర్‌ రాంచందర్‌ తెలిపారు.

తమకు ఇష్టంలేని చదువులు, లక్ష్యాలను రుద్దుతున్నారనే అభిప్రాయం ఉన్న పిల్లలు కన్నవారిని శత్రువులుగా భావిస్తున్నారు. ఇతరులతో పోల్చటం, చిన్నవిషయాన్ని పెద్దదిగా చేసి విమర్శించటం, క్రమశిక్షణ పేరుతో కట్టడి చేయటం వంటి అంశాలు ప్రతికూల ఆలోచనలు రేకెత్తిస్తుంటాయి. భార్యాభర్తల మధ్య తరచూ జరిగే గొడవలు కూడా బలమైన ప్రభావం చూపుతుంటాయి. ఇవన్నీ ఎదిగే వయసుతోపాటు పెరిగి విద్వేషంగా మారుతుంటాయి. ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్‌, మంచి మాటలతో దారికి తీసుకురాకుంటే కన్నవారితోపాటు చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ప్రతికూల భావనతో చూసే అవకాశాలున్నాయి. పదేళ్లలోపు చిన్నారులు కూడా అమ్మనాన్నలు మాకు నచ్చట్లేదంటూ చెబుతున్నారంటే ఆ ఇంట్లో వాతావరణాన్ని సరిచేసుకోవాలని మనస్తత్వ నిపుణులు డాక్టర్‌ హరికుమార్‌ తెలిపారు. తప్పొప్పులు పంచుకునే స్నేహితులు, ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవటంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

మనసెరగాలి.. దారి మళ్లించాలి

తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పిల్లల పెంపకంలో జాగ్రత్తగా ఉండాలి. తమ మాటలు, చేతలు బిడ్డలు గమనిస్తున్నారనేది గుర్తుంచుకోవాలి. ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలను సూచించాలి. ఆకస్మిక మార్పులు, ప్రవర్తన లోపాలు ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే వాళ్లతో మాట్లాడాలి. మంచి స్నేహితులుండాలి. వ్యక్తిగత విషయాలు చర్చించుకునే సన్నిహితులు ఉండాలి. స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదివించాలి. పరిస్థితి ఇబ్బందిగా అనిపించినప్పుడు కౌన్సెలింగ్‌ నిపుణుల వద్దకు తీసుకెళ్లాలి.

- డాక్టర్‌ హరికుమార్‌, మనస్తత్వ నిపుణులు

ABOUT THE AUTHOR

...view details