తెలంగాణ

telangana

ETV Bharat / state

బాల కార్మికుల చీకటి బతుకులు - Growing Child Labor in Hyderabad

గ్రేటర్‌ పరిధిలో బాలకార్మికులు చీకటిలో మగ్గుతున్నారు. చేయి చేయి కలిపి ఆడుకుంటూ ఆనందించాల్సిన ప్రాయంలో... యజమానుల ఇంట్లో కూటి కోసం శ్రమిస్తున్నారు. మహా నగరంలో సుమారు 10,000-12,000 మందికి పైగా బాలకార్మికులు ఉంటారని అంచనా.

child-labor-increase-in-greater-hyderabad
బాల కార్మికుల చీకటి బతుకులు

By

Published : May 25, 2020, 8:45 AM IST

Updated : May 25, 2020, 8:59 AM IST

పదేళ్ల వయసులోనే కుటుంబ భారం మోసేందుకు పనిలో చేరింది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ ఉరుకులు పరుగులు. హుందాగా కనిపించే ఇంట్లో వాళ్ల మాటలు తూటాల్లా తాకుతుంటాయి. ఏడాది జీతం ముందుగానే తీసు కెళ్లిన తండ్రి అక్కడ ఏం జరిగినా నోరు మెదపవద్దని వారించడంతో మౌనంగా ఉంటోంది. కొద్దిరోజులుగా ఆ చిన్నారికి వేధింపులు ఎక్కువ కావడం వల్ల ఇరుగు పొరుగువారు ఛైల్డ్‌లైన్‌ కేంద్రానికి ఫోన్‌ చేశారు. రంగంలోకి దిగిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి చిన్నారిని సంరక్షణ కేంద్రానికి పంపారు. మరో ఘటనలో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మనుమరాలి వయసుండే ఆ బాలికతో మద్యం మత్తులో అతగాడు వికృత చేష్టలకు దిగాడు. ఆ చిన్నారి భయపడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఘటన వెలుగు చూసింది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. గుట్టుగా పసిపిల్లల శరీరంపై పడుతున్న దెబ్బలు.. ఏడుపులు నాలుగు గోడలకే పరిమితమవుతున్నాయి.

దళారులుగా రౌడీషీటర్లు

గ్రేటర్‌ పరిధిలో బాలకార్మికులు చీకటిలో మగ్గుతున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలతో పనులు నిలిచిపోవడంతో కొందరు యజమానులు బాలకార్మికులను గదుల్లో బందీలుగా మార్చినట్టు సమాచారం. మహా నగరంలో సుమారు 10,000-12,000 మందికి పైగా బాలకార్మికులు ఉంటారని అంచనా. గాజుల పరిశ్రమ, ఇటుక బట్టీలు, హోటళ్లు, మెకానిక్‌ షెడ్లు, ఇంటి పనుల్లో 10-15 ఏళ్ల వయసున్న బాలబాలికలను కుదుర్చుతుంటారు. నగరం, శివార్లలోని కొందరు నేరస్థులు, రౌడీ షీటర్లు దళారులుగా మారుతున్నారు. బిహార్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, ఏపీ, తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ తదితర జిల్లాల్లోని పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని చిన్నారుల తల్లిదండ్రులతో బేరసారాలు సాగిస్తారు. ఏడాది, రెండేళ్లపాటు ఒప్పందం కుదుర్చుకుని ముందస్తుగా రూ. 5000-8,000 వరకు ఇస్తారు. తీసుకొచ్చిన చిన్నారులను అధిక ధర చెల్లించే పరిశ్రమలు, సంస్థలకు అప్పగిస్తారు. దళారులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు రౌడీషీటర్లు కావటంతో అధికారయంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని ఓ ఉన్నతాధికారి చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

ఇప్పుడేం జరుగుతోందంటే..?

లాక్‌డౌన్‌ నేపథ్యంలో బాలకార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. కుటుంబాలన్నీ ఇళ్లకే పరిమితమవడంతో ఇళ్లల్లో పనిచేస్తున్న బాలలపై పనిభారం పెరిగింది. ఈ నేపథ్యంలో పిల్లలు పడుతున్న ఇబ్బందులను చూస్తున్న స్థానికులు చిల్ట్రన్‌ హెల్ప్‌లైన్‌, పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఒక సహాయక కేంద్రానికి సుమారు 200కు పైగా బాలకార్మికుల సమాచారం అందింది. అధికార యంత్రాంగమంతా కరోనా కట్టడికి సమయం కేటాయించటం అక్రమార్కులకు మరింత అనువుగా మారింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో అధికారులు దృష్టి సారించారు. ఇటీవల నలుగురు బాలలను సంరక్షణ కేంద్రాలకు తరలించారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:'ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్​ చేయండి'

Last Updated : May 25, 2020, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details