Chikoti Praveen ED Investigation Concluded : క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోమారు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసుల్లో మే 15న (ఈరోజు) హాజరుకావాలని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ చీకోటి ప్రవీణ్ విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు ఈడీ చీకోటిని విచారించింది. థాయ్‌లాండ్ క్యాసినో కేసు తర్వాత చీకోటి సహా పలువురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీపై ఆయనను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది.
క్యాసినో కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై గతంలో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం విధితమే. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు చీకోటిని ప్రశ్నించిన ఈడీ అధికారులు.. తాజాగా థాయ్‌లాండ్ ఘటన నేపథ్యంలో మరోసారి నోటీసులు జారీ చేశారు. చీకోటితో పాటు ఈ వ్యవహారంతో సంబంధముందని భావిస్తున్న చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్‌కు కూడా ఈ ఈడీ నోటీసులు ఇచ్చారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో సంపత్ గతంలో విచారణకు హాజరయ్యారు. మిగతా ముగ్గురు కూడా హాజరుకావాల్సిందిగా ఈడీ నోటీసులలో తెలిపింది.
ఇది జరిగింది:క్యాసినో కేసులో థాయ్‌లాండ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్, అతని అనుచరులతో పాటు.. క్యాసినో ఆడేందుకు వెళ్లిన వారిని థాయ్‌లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే క్రెడిట్స్‌ను అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని కోన్ బురి జిల్లా బ్యాంగ్ లా ముంగ్లో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.