ధరణి సన్నద్ధత, క్రమబద్దీకరణతో పాటు ఇతర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ ఉదయం దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్న సీఎస్ సోమేశ్ కుమార్ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలకు సంబంధించి పురోగతిని తెలుసుకుంటారు. అదనపు కలెక్టర్లతో పాటు జిల్లా పంచాయతీ అధికారులు కూడా సమీక్షకు హాజరు కానున్నారు. ధరణి సన్నద్ధతను సమీక్షించడంతో పాటు అనుమతులు లేని ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణ సంబంధిత అంశాలపై సీఎస్ సమీక్షిస్తారు. ధరణి పోర్టల్‌ను అమలు చేసేందుకు వీలుగా తహసీల్దార్ కార్యాలయాల్లో అవసరమైన ఐటీ, ఇతర మౌలికసదుపాయాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వాటి పురోగతిని కూడా సీఎస్ సమీక్షిస్తారు.
ధరణి సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో నేడు సీఎస్ సమీక్ష - cs somesh kumar
అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్‌కుమార్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి సన్నద్ధత, అనుమతులు లేని ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణతో పాటు ఇతర అంశాలపై సమీక్షించనున్నారు.
పక్షం రోజుల్లోగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం నేపథ్యంలో సంబంధిత అంశాలపై చర్చిస్తారు. వీటితో పాటు రైతువేదికల నిర్మాణం, పల్లెప్రకృతి వనాలు, వీధివ్యాపారులు, సీఎంఆర్ బియ్యం తదితరాలకు సంబంధించి కూడా సమీక్షిస్తారు. అటు ఆన్లైన్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు సహా వివిధ కార్యక్రమాల పురోగతి ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో పల్లెప్రగతి పనులను ఇలాగే ఆకస్మిక తనిఖీలు చేశారు. తాజాగా జరగనున్న ఆకస్మిక తనిఖీలకు సంబంధించి కూడా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ చర్చించనున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు వెంటనే ఇవ్వాలి: హరీశ్