CM KCR Visits Rain Affected Areas: ఉగాది పండుగకు 4 రోజుల ముందు రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన వర్షాలు, వడగండ్ల వానలు... రైతులను నిండా ముంచేశాయి. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు వర్షార్పణమయ్యాయి. జరిగిన నష్టంపై ప్రభుత్వం ఇప్పటికే సర్వే చేపట్టగా.. దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం.. ముందుగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలోని రామాపూరానికి చేరుకుంటారు. అక్కడ తీవ్రంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించి.. నష్టపోయిన రైతులతో కేసీఆర్ మాట్లాడుతారు.
పంట నష్టంపై రైతులతో మాట్లాడనున్న సీఎం: ఖమ్మం జిల్లా పర్యటన అనంతరం ముఖ్యమంత్రి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు చేరుకుంటారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించి నష్టపోయిన రైతులకు భరోసానివ్వనున్నారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి వెళ్లి.. అకాల వర్షాల ప్రభావిత పంటలను పరిశీలిస్తారు. జరిగిన పంట నష్టంపై రైతులతో మాట్లాడనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 11 వేల ఎకరాల్లో.. పంట నష్టపోయినట్లు అధికారులు ఇప్పటివరకూ అంచనా వేశారు. పూర్తి స్థాయి లెక్కలు పూర్తయితే.. నష్టం మరింత పెరిగే అవకాశముంది. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యవేక్షిస్తున్నారు. హెలీప్యాడ్‌తో పాటు భారీ బందోబస్తుతో ఏర్పాట్లు చేస్తున్నారు.
అధికారులతో సమీక్ష జరపనున్న కేసీఆర్: వరంగల్ జిల్లా నుంచి మధ్యాహ్నం కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ బయలుదేరనున్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. జిల్లాలో జరిగిన పంట నష్టంపై అక్కడి నుంచే సమీక్షించనున్నారు. లక్ష్మీపూర్‌లోని రైతు రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద పుచ్చకాయ, మస్క్ మిలన్, లిచ్చి యాపిల్, వరి పంటతో పాటు సమీపంలోని మామిడి తోటలను కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం జిల్లాలో పంట నష్టంపై అక్కడి రైతు వేదికలో అధికారులతో సమీక్ష జరపనున్నారు. పలువురు రైతులతో మాట్లాడనున్న కేసీఆర్ పరిస్థితులను తెలుసుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, కలెక్టర్ కర్ణన్‌తో కలిసి పరిశీలించారు.