BRS Meeting in Aurangabad Today: మహారాష్ట్రలో మూడో బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సర్వం సిద్ధం చేసింది. గతంలో నాందేడ్, కాందర్ లోహ సభలతో మహారాష్ట్ర రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఔరంగబాద్‌లో అడుగు పెడుతోంది. ఔరంగబాద్‌లోని జబిందా మైదానంలో బహిరంగ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. ఇవాళ సభకు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్, బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ సహా తదితరులు కొంతకాలంగా ఔరంగబాద్‌లోనే ఉండి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ తరహా అభివృద్ధి: మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణ కసరత్తు చేశారు. బహిరంగ సభలను నిర్వహించే ఘనంగా బీఆర్ఎస్.. ఔరంగబాద్ సభకూ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సభ వేదికతో పాటు కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఔరంగబాద్‌లో పలు ప్రాంతాల్లో కటౌట్లు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రతో పాటు దేశమంతటా అత్యవసరని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. మరాఠా ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ప్రచారం చేస్తోంది. సన్నాహక సమావేశాల్లోనూ అక్కడికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నారు.