Buddha Purnima Celebrations in Hyderabad : 2500 ఏళ్ల క్రితమే శాంతియుత సహ జీవన సూత్రాలు, కార్యాచరణను విశ్వ మానవాళికి అందించిన బుద్ధుడు సంచరించిన నేల మీద జీవిస్తుండటం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని బోధనలు, కార్యాచరణను స్మరించుకున్నారు. సమస్త జీవరాసుల పట్ల ప్రేమ, కరుణ, అహింస, శాంతి, సహనంతో ఉండాలని సూచించారు. ప్రకృతితో కలిసి ఆనందంగా జీవించాలనే మహాబోధి గౌతమ బుద్ధుని జ్జానమార్గం.. నేటి సమాజానికి ఎంతో అవసరమని అన్నారు.
మానవ సమాజం కొనసాగినంత వరకు బుద్ధుని ప్రసంగాలు ఉంటాయి: గౌతముని బోధనలను ఆచరిస్తే మానవ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వర్ణ, లింగ, జాతి తదితర వివక్ష, ద్వేషాలకు వ్యతిరేకంగా, మహోన్నతమైన దార్శనికత, తాత్విక జ్జానంతో బుద్ధ భగవానుడు నాడు బోధించి ఆచరించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సూత్రాలు అజరామరమైనవని కేసీఆర్ అన్నారు. మానవ సమాజం కొనసాగినన్నాల్లూ బుద్దుని బోధనలకు ప్రాసంగికత ఉంటుందని తెలిపారు. తెలంగాణలో బౌద్ధం పరిఢ విల్లడం ప్రజలందరికీ గర్వకారణమని చెప్పారు.