CM KCR Review on Crop Loss : రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఇవాళ ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిత్తల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రధానంగా వర్షాలకు జరిగిన పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం.. తదితర అంశాలపై సీఎం సమీక్ష చేశారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట పరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించారు. దానిని తక్షణమే అమలు చేయాలని సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న సీఎం కేసీఆర్.. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు.
గృహలక్ష్మికి విధివిధానాలు రూపొందించాలి..: ఖాళీ జాగాలు కలిగి ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు లెక్కన ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించి ఉత్తర్వులు జారీ చేయాలని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. పంట నష్టానికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లా పరిధిలో క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి వివరాలను ప్రభుత్వానికి అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.