తెలంగాణ

telangana

ETV Bharat / state

cm kcr review: 'సమాన వాటాకోసం బలమైన వాణి వినిపించండి' - కృష్ణా జలాలపై కేసీఆర్​ సమీక్ష

cm kcr
cm kcr

By

Published : Aug 20, 2021, 6:17 PM IST

Updated : Aug 20, 2021, 10:51 PM IST

18:15 August 20

'సమాన వాటాకోసం బలమైన వాణి వినిపించండి'

  నదీజలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా కోసం నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో బలమైన వాణి వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు (cm kcr review on krmb) స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో ప్రగతిభవన్​లో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో యాభై శాతం జలాలు కావాలన్న విషయమై అన్ని ఆధారాలతో భేటీ ముందు ఉంచాలని దిశానిర్దేశం చేశారు. మల్లన్నసాగర్ పనుల పురోగతిపైనా సీఎం కేసీఆర్ ఆరా తీశారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పనులను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం ఉంది.  

అజెండాపై చర్చ

 రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం, కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో బోర్డు సమావేశంలోని అజెండా అంశాలతో పాటు రాష్ట్రం తరఫున ప్రస్తావించాల్సిన, లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో చెరిసగం వాటా కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది. ఈ అంశాన్ని కేఆర్ఎంబీ సమావేశ అజెండాలో చేర్చారు. అటు జలవిద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలపై చర్చించేందుకు కూడా అజెండాలో చేర్చారు. ఈ రెండింటితో పాటు ఇతర అంశాలకు సంబంధించి రాష్ట్రం పక్షాన వినిపించాల్సిన వాదనలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.  

రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి చెప్పండి

 అజెండాలో చేర్చిన అంశాలతో పాటు మరికొన్ని ఇతర అంశాలపైనా బోర్డు భేటీలో చర్చించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి వెళ్లాలని... దశాబ్దాలుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు న్యాయమైన, చట్టపరమైన అంశాల ఆధారంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కోసం వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణ మధ్య 70, 30 నిష్పత్తితో నీటిపంపిణీ సహా ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వాస్తవాలన్నీ బోర్డు ముందు ఉంచాలని సీఎం అధికారులకు సూచించారు.  

మల్లన్నసాగర్​ పనుల పురోగతిపై ఆరా..

అటు మల్లన్నసాగర్ జలాశయ పనుల పురోగతిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ జలాశయం పనులు తుదిదశకు చేరుకొన్నాయి. ఈ సీజన్​లో ఎట్టిపరిస్థితుల్లోనూ జలాశయాన్ని నింపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ముంపు గ్రామాలు ఇంకా ఖాళీ కానందున పూర్తిగా కాకుండా కనీసం పది టీఎంసీలు నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంపు గ్రామాల ఖాళీ పనులు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ పరిస్థితుల్లో జలాశయం పనులు, ముంపు గ్రామాల ఖాళీ తదితరాల పురోగతిని సీఎం కేసీఆర్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్ పనులను ముఖ్యమంత్రి త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఉంది. 

ఇదీ చూడండి:ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం కేటాయించాలి: కృష్ణాబోర్డుకు లేఖ

Last Updated : Aug 20, 2021, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details