వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - hyderabad latest news
14:14 July 22
వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. లక్షలాది మంది రైతులతో, కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ మొండి పట్టుదల, నిరంతర శ్రమతో పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. సంప్రదాయక వ్యవసాయ పద్ధతుల స్థానంలో గొప్ప పరివర్తన రావాలన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న రైతులకు సంఘటిత శక్తిలోని బలమెంతో చూపించేందుకు.. మేలైన సాగు విధానాలు, లాభదాయక పద్ధతులు చెప్పేందుకు వ్యవసాయ శాఖ మార్గదర్శనం చేయాలన్నారు.
తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతోందని.. దానికి తగ్గట్టు వ్యవసాయ శాఖ కూడా సంస్థాగతంగా బలోపేతం కావాలన్నారు. అవసరమైతే వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో రైతులు నూటికి నూరు శాతం చెప్పిన పంటలే వేశారని.. ఏ గుంటలో ఏ రైతు ఏ పంట పండిస్తున్నారో కచ్చితమైన వివరాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్లస్టర్ల వారీగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం మూడు నెలల్లో పూర్తవుతుందని సీఎం తెలిపారు. రైతు వేదికలు రైతుల చైతన్యానికి వేదికలుగా మారుతాయని.. ముఖ్యమంత్రితోపాటు ఎవరైనా సరే నేరుగా రైతులతో మాట్లాడే వెసులుబాటు ఉంటుందన్నారు. వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులు రావాలన్నారు. యాంత్రీకరణ పెరగాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:లేహ్ నుంచి దిల్లీకి ఆకాశమార్గాన అమృత ధారలు