CM KCR on TS Assembly Elections : తెలంగాణ భవన్‌లో అట్టహాసంగా జరిగిన భారత రాష్ట్ర సమితి వార్షికోత్సవంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరయ్యారు. సభ ప్రారంభం, ముగింపులో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బాగా పనిచేస్తే మంచిదని.. లేదంటే మీకే నష్టమని ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబరులోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని.. ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. సమయం తక్కువగానే ఉన్నందున విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఇంకా పడిపోయిందన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలలు కీలకమని అంతా చురుగ్గా పనిచేయాలని కేసీఆర్ ఆదేశించారు.
Telangana Assembly Elections 2023 : మన మంత్రులు పారదర్శకంగా పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఏపీ తలసరి ఆదాయం రూ.2,19,518. ఇది మన కన్నా రూ.లక్ష తక్కువన్నారు. ఇంత కన్నా తక్కువ ఉన్న రాష్ట్రాలు 16, 17 ఉన్నాయన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడులను దాటేశామని.. తెలివి ఉంటే బండ మీద నూకలు పుట్టించుకోవచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ ఆత్మీయ సభల నిర్వహణ బాగుందని.. నియోజకవర్గాల వారీగా సభలు విజయవంతంగా జరిగాయన్నారు.
తేడాలు రానివ్వద్దు.. కఠిన చర్యలుంటాయ్: అందుకు పార్టీ శ్రేణులకు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు అభినందనలు తెలిపారు. ముఖ్యమైన పథకాల్లో పారదర్శకంగా కొనసాగాలని కేసీఆర్ స్పష్టం చేశారు. గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ, పోడు భూముల పట్టాలు.. 58, 59 జీవోల ప్రకారం క్రమబద్ధీకరణ.. ఇవి సామాన్యులకు, పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలని తెలిపారు. అత్యంత క్రమశిక్షణతో అమలు చేయించాల్సి ఉంటుందన్నారు. ఎటువంటి తేడాలు రానివ్వద్దని.. వస్తే కఠిన చర్యలుంటాయని కేసీఆర్ హెచ్చరించారు.