Chief Election Officer Vikasraj on Telangana Assembly Elections 2023 : రానున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్(State Chief Election Officer Vikasraj) తెలిపారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో శిక్షణ పూర్తయిందని.. జిల్లాల్లోనూ సిబ్బందికి శిక్షణలు ప్రారంభించామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా(Telangana Voters List) ప్రత్యేక సవరణకు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
ఇందులో మార్పులు, చేర్పుల కోసమే 9 లక్షలకు పైగా అర్జీలు అందాయని తెలిపారు. ఇలాంటివి గతంలో 1-2 లక్షలు కూడా వచ్చేవి కాదన్నారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు పది రోజుల ముందువరకు వచ్చిన ఓటరు దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ అధికారులు పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన నేపథ్యంలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై సెప్టెంబరు 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని.. అక్టోబరు 4వ తేదీన తుది ఓటర్ల జాబితా(Final Voters List) ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలోఎన్నికల సన్నద్ధతపై ఆయన ఈటీవీ భారత్‌తో మాట్లాడారు.
EC Focus on Telangana Assembly Elections 2023 : ఈ దఫా పెద్ద సంఖ్యలో తొలితరం ఓటర్లు నమోదయ్యారని చెప్పారు. ఓటర్ల సంఖ్య పెరగడంతో పోలింగ్ కేంద్రాలు కూడా భారీగా పెరిగాయన్నారు. ప్రతి కేంద్రంలో 1,500 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే పరిస్థితి రాకుండా విస్తృత కసరత్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆగస్టు 26, 27 తేదీల్లో నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభించిందన్నారు. సెప్టెంబరు 2, 3 తేదీల్లోనూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు.