Charminar Night Bazaar in Ramadan season: హైదరాబాద్లో రంజాన్ మాసం పేరుచెపితే చాలు వెంటనే గుర్తుకొచ్చేది పాతబస్తీ చార్మినార్, శాలిబండ, పురానాపూల్.. వాటితో పాటు మక్కా మసీదు. ముఖ్యంగా రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద సందడే వేరు. ఇక్కడి నైట్ బజార్ సందర్శకులను కనువిందు చేస్తుంది. ఏడాది మొత్తం ఓ ఎత్తు అయితే రంజాన్ మాసంలో ఇక్కడ జరిగే షాపింగ్ మరో ఎత్తని చెప్పవచ్చు. నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి జనం ఇక్కడ షాపింగ్ చేసేందుకు వస్తుండడంతో.. పాతబస్తీ ప్రాంతం కిటకిటలాడుతుంది. సాయంత్రం ఇఫ్తార్ సమయం ముగిసిన తర్వాత ప్రారంభమయ్యే ఈ షాపింగ్ అర్ధరాత్రి వరకూ కొనసాగుతుంది.
Charminar Night Bazaar : అలంకార వస్తువులతో సహా అన్ని వెరైటీలు ఈ నైట్ బజార్లో లభిస్తాయి. ఈసారి సరికొత్త సరకుతో ముందుకు వచ్చినట్లు దుకాణదారులు చెబుతున్నారు. మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. వేసవిలో రాత్రి పూట వచ్చే చల్లగాలుల మధ్య.. చారిత్రక ప్రదేశమైన చార్మినార్ వద్ద రాత్రిపూట షాపింగ్ చేస్తుంటా.. వచ్చే మజాయే వేరంటూ కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు కొనేస్తున్నారు. ఈసారి ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని సంబురపడుతున్నారు.
Haleem at Charminar : గాజుల తయారీ, అమ్మకాల్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా పేరుగాంచిన పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని దుకాణ యజమానులు కొత్త కొత్త డిజైన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ నగరం ముత్యాలు, గాజులకు ప్రసిద్ధి కావడంతో వాటిని ఖరీదు చేసేందుకు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా కొనుగోలుదారులు నగరానికి తరలివస్తున్నారు. రంజాన్ ఉపవాస నెలలో సంప్రదాయబద్ధంగా ఉపయోగించే సుర్మా టోపీలు, సుగంధ ద్రవ్యాలు, అత్తరులు, ప్రత్యేక దుస్తులు, కుర్తా పైజామా వంటి వాటికి రోజురోజుకీ గిరాకీ పెరుగుతోంది.