Changes In Amit Shah Visit To Hyderabad On March 11: తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రతి 15రోజులకు ఒకసారి రాష్ట్రంలో పర్యటిస్తానని పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో పర్యటించాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనల్లో బీజేపీ అధిష్ఠానం మార్పులు చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న హైదరాబాద్కు రావలసిన కేంద్రమంత్రి అమిత్ షా.. మరుసటి రోజు సంగారెడ్డిలో జరగాల్సిన బీజేపీ మేధావుల సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. అయితే అదే రోజు ఈనెల12న అమిత్ షా కేరళ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కానీ ఈ నెల 11న రాష్ట్ర బీజేపీ నేతలను అమిత్ షా కలిసే అవకాశం ఉందని సమాచారం. మళ్లీ తిరిగి అమిత్ షా తెలంగాణ పర్యటన ఎప్పుడు ఉంటుందో.. తొందరలోనే ప్రకటించి.. షెడ్యూల్ను ఖరారు చేస్తామని బీజేపీ అధిష్ఠానం పేర్కొంది.
పార్లమెంట్ ప్రవాస్ యోజనలో అమిత్ షా పాల్గొంటారని.. అదీ ఏ పార్లమెంటు నియోజకవర్గంలో పాల్గొనే అంశంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.. అయితే ఇప్పుడు పర్యటనలో మార్పులు చేశారు. గతంలో కూడా ఇలానే ఆదిలాబాద్ పర్యటనను చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. రాబోయే తెలంగాణ శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. బీజేపీ నాయకత్వం ఇక్కడ విజయం కోసం వ్యూహాలను రచిస్తోంది.