కొవిడ్ సమయంలో నాలుగు గోడలకే పరిమితమైన చిన్నారులు మానసికంగా నలిగిపోతున్నారు. ఆడిపాడాల్సిన వయసులో ఇంటికే పరిమితం కావడంతో ప్రవర్తన లోపాలు మరింత ఆందోళనకు కారణమవుతున్నాయి. మారిన దినచర్యతో పసితనంలోనే బద్దకం, తిండి, నిద్రవేళల్లో మార్పులు వచ్చాయి. మిత్రులను కలిసే అవకాశం దూరమవటంతో స్మార్ట్‌ఫోన్లు కాలక్షేపంగా మారాయి. సున్నితమైన సమస్యలను బయటకు పంచుకోలేక.. పరిష్కారం కనిపించక మహానగరంలో వేలాది మంది తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. సలహాలకు కొందరు మానసిక కౌన్సెలింగ్ నిపుణుల వద్దకు వెళుతున్నారు.
ఎన్నో సందేహాలు.. మరెన్నో ఆవేదనలు
ఆన్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్ సైకాలజిస్టు గీతా చల్లా నిర్వహించిన సమావేశంలో దాదాపు 80-90 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల మానసిక ఎదుగుదల, ఊబకాయం, సెల్‌ఫోన్ల ప్రభావం, ఒంటరితనం, బద్దకం తదితరమైనవి ప్రధాన సమస్యలని వెల్లడించారు. మరికొందరు స్వేచ్ఛగా ఎదగాల్సిన చిన్నారులు నాలుగు గోడల మధ్య బందీగా ఉండటంపై ఆవేదన వెలిబుచ్చారు. కొందరు కన్నవారు వెలిబుచ్చిన కొన్ని సందేహాలు. కౌన్సెలింగ్ సైకాలజిస్టు గీతా చల్లా ఇచ్చిన పరిష్కారాలు ఇలా ఉన్నాయి.
నాలుగేళ్ల బాబు. ఆన్‌లైన్ తరగతులు ఎలా వినాలో తెలియట్లేదు. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఉపాధ్యాయులకు చేరువ కాలేకపోతున్నాడు. చూసి నేర్చుకోవటం కష్టంగా మారుతోంది. పాఠం పూర్తయ్యేంత వరకూ పక్కనే ఉండాల్సి వస్తుంది. చిన్నపిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు ఎలా అలవాటు చేయాలి? పిల్లలు కోల్పోతున్న బాల్యాన్ని ఎలా అందించాలి?
- రాధిక, నిజాంపేట
పసిపిల్లలున్న కుటుంబాల్లో తల్లే గురువుగా మారాలి. రేపటి కోసం ఈ రోజే ప్రణాళిక తయారుచేసుకోవాలి. చిన్నారుల మనస్తత్వం, విద్యకు సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు చేయాలి. ఇంట్లోనే వారి కోసం కొంత స్థలం కేటాయించాలి. అది కేవలం మీ కోసమే అనే భావన పిల్లల్లో కలిగించాలి. సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. ఆన్‌లైన్ తరగతులు పూర్తయ్యాక ఖాళీ సమయాన్ని మరికొన్ని యాక్టివిటీస్ కోసం కేటాయించాలి. స్నేహితులు, బంధువులతో వీడియోకాల్స్ మాట్లాడించాలి. జట్టుగా కలిసి చేసే పనులను అప్పగించాలి. అప్పుడు ఒంటరి అనే భావన వారిలో కనిపించదు.
ఇద్దరు పిల్లలు. వారి దినచర్య తారుమారైంది. ఎప్పుడు నిద్రపోతున్నారు? ఎప్పుడు తింటున్నారనే దానికి సమయపాలన లేకుండా ఉంది. కొవిడ్ మూడో దశ పిల్లలపై ప్రభావం చూపుతుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో వాళ్లను మరింత క్రమశిక్షణగా ఉంచుతున్నాం? గడప దాటకుండా చేస్తున్నాం? వీళ్లను కట్టడి చేయటం, రోగ నిరోధక శక్తిని పెంచటం ఎలానో తెలియడం లేదు?
- రేవతి, బంజారాహిల్స్
ఎదిగే పిల్లలకు విద్య, జీవన నైపుణ్యాలు చాలా అవసరం. శారీరక శ్రమ దూరమైతే ఊబకాయం వస్తుంది. ప్రస్తుతం సమస్యలకు ఇంట్లోనే పరిష్కారం చూపాలి. వ్యాయామం కోసం ఎగరటం, గెంతటం, కూర్చుని లేవటం, సంగీతం వింటూ నృత్యం చేయటం, యోగాసనాలు సాధన చేయించొచ్చు. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంచాలి. పండ్లు, ఇంట్లో వండిన పదార్థాలు పిల్లల్లో వ్యాధి నిరోధకతను పెంచుతాయి. వంటింట్లో లభించే వాటితో తయారు చేసిన సంప్రదాయ ఆహారాన్ని అలవాటు చేయాలి. రోజూ నిర్దిష్టమైన సమయంలో నిద్రలేవటం/నిద్రపోవటం, ఆహారం, చదువు, ఆటపాటలు, టీవీ చూడటాన్ని అలవాటుగా మార్చాలి.