ప్రతిష్ఠాత్మక ‘చంద్రయాన్-2’కు ఆది నుంచీ జాప్యాలు తప్పలేదు. ఈ ప్రాజెక్టుకు 2008 సెప్టెంబర్ 18న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రయోగం కోసం రష్యాతో కలిసి పనిచేయాలని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలుత భావించింది. దానిప్రకారం ఆర్బిటర్, రోవర్‌ను ఇస్రో రూపొందించాలి. ల్యాండర్‌ను రష్యా సరఫరా చేస్తుంది. 2013లో చంద్రయాన్-2ను ప్రయోగించాలని తొలుత భావించారు. అయితే వరుస ఇబ్బందులతో ఈ ప్రాజెక్టు ఏళ్ల తరబడి వాయిదాలు పడుతూ వచ్చింది.
వెనక్కి తగ్గిన రష్యా
రష్యా వైదొలగడం వల్ల ‘చంద్రయాన్-2’లో వాయిదాల ప్రస్థానానికి బీజాలు పడ్డాయి. అంగారకుడి చందమామ ‘ఫోబోస్’ వద్దకు ఆ దేశం ప్రయోగించిన ‘ఫోబోస్-గ్రంట్’ వ్యోమనౌక విఫలమైంది. ఆ వ్యోమనౌకలోని సాంకేతిక అంశాలనే చంద్రయాన్-2లోనూ ఉపయోగించాల్సి ఉండటం వల్ల రష్యా వెనక్కి తగ్గింది. సదరు సాంకేతికాంశాలపై పూర్తిస్థాయి సమీక్ష జరిపాకే తదుపరి ప్రయోగాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. దీంతో ల్యాండర్‌ను కూడా సొంతంగానే తయారుచేసుకోవాలని ఇస్రో నిర్ణయించింది. ఒక విధంగా రష్యా నిర్ణయం మన దేశానికి కలిసొచ్చింది. గ్రహాంతర యాత్రల్లో కీలకమైన ల్యాండర్ పరిజ్ఞానాన్ని భారత్ సొంతంగా అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్పించింది.
బరువు పెరగడమే కారణం...
రష్యా వైదొలిగాక ల్యాండర్ సంబంధిత సమస్యలతో ‘చంద్రయాన్-2’ వాయిదా పడుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టును 3.2 టన్నుల బరువుతో చేపట్టాలని ఇస్రో తొలుత భావించింది. అయితే, ఆ డిజైన్‌తో యాత్ర చేపడితే జాబిల్లిపై ల్యాండర్ దిగే సమయంలో, రాకెట్లను మండించినప్పుడు సమస్యలు ఉత్పన్నం కావొచ్చని గుర్తించింది. దీనికి తోడు ఆ ప్రాజెక్టుపై సమీక్ష జరిపిన జాతీయ నిపుణుల కమిటీ కూడా వ్యోమనౌకకు అనేక మార్పులను సూచించింది. కీలక వ్యవస్థలు విఫలమైతే ఇబ్బందులు తలెత్తకుండా వాటికి ప్రత్యామ్నాయాలు ఉండాలని పేర్కొంది. వైరింగ్ వ్యవస్థ సహా అనేక చోట్ల మార్పులు చేయాలని కోరింది. పరీక్షల్లో వెల్లడైన అంశాలు, నిపుణుల సూచనలను ఆచరణలోకి పెట్టడంతో చంద్రయాన్-2 బరువు 3.8 టన్నులకు పెరిగింది. ఫలితంగా మొదట అనుకున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్-2 రాకెట్‌కు అంత బరువును మోసుకెళ్లే సామర్థ్యం లేదు. అందువల్ల జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ని ఉపయోగించాలని ఇస్రో నిర్ణయం మరింత జాప్యానికి కారణమైంది.
దాదాపు నాలుగుసార్లు ప్రయోగాన్ని వాయిదా వేస్తూ... చివరిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగిద్దామనుకొని, తర్వాత జులై 15(సోమవారం)కు మార్చారు.
మంగళయాన్‌కు కలిసొచ్చింది
చంద్రయాన్-2 ఆర్బిటర్ ఇంచుమించుగా చంద్రయాన్-1 తరహాలోనే ఉంటుంది. అందువల్ల చంద్రయాన్-2 ఆర్బిటర్‌ను ఇస్రో చాలా ఏళ్ల కిందటే సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు నుంచి రష్యా వైదొలిగాక జాప్యం తలెత్తడం వల్ల ఆ ఆర్బిటర్‌ను 2013లో ఇస్రో తన తొలి అంగారక యాత్ర ‘మంగళయాన్’ కోసం ఉపయోగించింది. ప్రాజెక్టు మంజూరైన 13 నెలల్లోనే ‘మంగళయాన్’ను చేపట్టడం వెనుక రహస్యం ఇదే.
అప్రమత్తతే కాపాడింది