తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 22న నింగికెగరనున్న చంద్రయాన్‌-2 - Chandrayaan-2 to be released on the 22nd of this month?

చందమామ దగ్గరికెళ్లేందుకు ప్రయత్నించి సాంకేతిక సమస్యలతో అవరోధం ఏర్పడినా... వాటిని అధిగమించి నింగిలోకి దూసుకెళ్లేందుకు చంద్రయాన్​-2 సిద్ధమవుతోంది. ఇప్పటికే లోపాలను సరిచేసేందుకు కృషి చేస్తున్న నిపుణులు ఈ నెల 22న మధ్యాహ్నం 2గంటల 43 నిమిషాలకు వాహననౌకను ప్రయోగించాలని నిర్ణయించారు. దీనిపై ఇస్రో అధికారిక ప్రకటన చేసింది.

చంద్రయాన్​

By

Published : Jul 18, 2019, 7:31 AM IST

Updated : Jul 18, 2019, 12:09 PM IST

ఈనెల 22న నింగికెగరనున్న చంద్రయాన్‌-2

సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని మళ్లీ ఈనెల 22న నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 ద్వారా చంద్రయాన్‌-2 ల్యాండర్​ను మధ్యాహ్నం 2గంటల 43 నిమిషాలకు ప్రయోగించనున్నారు.

ఈ నెల 15న వేకువ జామున చంద్రయాన్‌-2 ప్రయోగానికి 56 నిమిషాల ముందు... క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ట్యాంకర్‌లోని ప్రెజర్‌ బాటిల్‌లో లీకేజీ ఏర్పడటం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేశారు. సోమవారం మధ్యాహ్నానికి ఇంధనాన్ని వాహకనౌక నుంచి తీసేశారు. తమిళనాడులోని మహేంద్రగిరి ఎల్‌పీఎస్‌సీ కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు వాహకనౌకను తమ ఆధీనంలోకి తీసుకుని అప్పటి నుంచి వివిధ రకాల పరీక్షలు చేపట్టారు.

క్రయోజెనిక్ ఇంజిన్​లో సమస్యతో ఆగిన ప్రయోగం

క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ట్యాంకర్‌లో ప్రెజర్‌ బాటిల్‌ లీకేజీ వల్లే 30 నుంచి 320 బార్లు ఉన్న పీడనం 290కు పడిపోయినట్లు గుర్తించారు. సమస్యను అధిగమించే చర్యలు చేపట్టారు. లోపాన్ని ప్రయోగ వేదికపైనే సరిచేసే వీలున్న దృష్ట్యా ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. వాహకనౌకను 2 రోజుల వ్యవధిలో లోపరహితంగా సిద్ధం చేసే వీలుంది. ఈనెల 20న రాకెట్‌ సన్నద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటల నుంచి కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. 20 గంటల పాటు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిర్వహించాక... జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నింగిలోకి చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని తీసుకెళ్లనున్నారు.

షార్‌కు క్రయోజెనిక్‌ నిపుణుడు జ్ఞానగాంధీ

ఇస్రో శాస్త్రవేత్తల ఆహ్వానం మేరకు బుధవారం షార్‌కు క్రయోజెనిక్‌ ఇంజిన్‌ నిపుణుడు పద్మశ్రీ వాసుదేవన్‌ జ్ఞానగాంధీ హైదరాబాద్‌ నుంచి వచ్చారు. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల వివరాలను జ్ఞానగాంధీకి ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు. రెండో ప్రయోగ వేదికపై ఉన్న వాహకనౌక, అందులోని క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను గాంధీ పరిశీలించి, తదుపరి చేయాల్సిన పనులపై శాస్త్రవేత్తలతో సమీక్షించారు.

ఇవీ చూడండి: ఈ నెల 20 నుంచే 'కొత్త పింఛన్లు'

Last Updated : Jul 18, 2019, 12:09 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details