ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన (Chandra Babu Naidu Chittoor Tour) కొనసాగుతోంది. వరద బాధితులకు మనో ధైర్యం ఇచ్చేందుకే తాను వచ్చానని చంద్రబాబు తెలిపారు. పెద్దఎత్తున వర్షాలు కురుస్తాయని ముందే తెలిసినా ప్రభుత్వం ఏంచేసిందని... ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంత నష్టం కలిగేదా? అని ప్రశ్నించారు. ఎవరూ అధైర్యపడవద్దని... తెదేపా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వరద సాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే... సీఎం గాలిలో తిరుగుతారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ వాయిదా వేసుకుని సీఎం రావాలన్నారు.
అసెంబ్లీలో నా భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైకాపా నేతలు మాట్లాడారు. 22 ఏళ్లు తెదేపా అధికారంలో ఉన్నా.. ఆమె బయటకు రాలేదు. 40 ఏళ్లుగా ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా. అలిపిరిలో నా కారుపై మందుపాతర పేలినా భయపడలేదు. నా భార్యపై అనుచిత వ్యాఖ్యలతో ఎంతో బాధపడ్డా. మీ కుటుంబంలో మహిళలకు ఇలా జరిగితే మీరు బాధపడరా?. కౌరవ సభలో ఉండలేనని చెప్పి బయటకు వచ్చేశా. ప్రజల వద్దకు వెళ్లి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని చెప్పా. ఇలాంటి ఉన్మాదులతో నేను పోరాడాలా. నేను కంపెనీలు తెస్తే.. వీళ్లు దందాలు చేస్తున్నారు. వేల కోట్లు అక్రమంగా సంపాదించి ఎన్నికల్లో అక్రమాలు చేస్తున్నారు. చిన్న కుప్పం పట్టణంలో అక్రమాలు చేసి మొనగాళ్లమని విర్రవీగుతున్నారు. ఎన్నో అక్రమాలు చేసి కుప్పం ఎన్నికల్లో గెలిచారు. తప్పుడు పనులు చేసేవాళ్లను అధికారంలోకి వచ్చాక వదిలేది లేదు. -చంద్రబాబు, తెదేపా అధినేత