Chandrababu Fires On CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయ భూములను టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు. కృష్ణపట్నం పెద్ద పారిశ్రామిక హబ్‌గా మారాలని కోరారు. రామాయపట్నం పోర్టును ఎందుకు రద్దు చేశారో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక హబ్‌గా మారాల్సిన ప్రాంతాన్ని జగన్ అడ్డుకున్నారని.. భావనపాడు పోర్టును వేరే వారికి ఎందుకు అప్పగించారని చంద్రబాబు ప్రశ్నించారు.
పోర్టులను ఎందుకు రద్దు చేశారో సీఎం జగన్ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గతంలో అందరినీ ఒప్పించి దగదర్తి విమానాశ్రయాన్ని తీసుకువచ్చామని.. కానీ జగన్ చేసిన దగాలో ఒక భాగం.. దగదర్తి విమానాశ్రయం అని విమర్శించారు. పోర్టులను ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలని నిలదీశారు. కృష్ణపట్నం పోర్టు విషయంలో అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఏషియన్ పల్ప్ పరిశ్రమ వచ్చి ఉంటే వేలమందికి ఉద్యోగాలు వచ్చేవని.. కానీ ఆ సంస్థను తరిమేసి ఉపాధి పోగొట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.