తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు ఏపీలో 'జనభేరి' సభ.. హాజరుకానున్న చంద్రబాబు - Janabheri Latest News

ఏపీలో అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా నేడు ఐకాస భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. అమరావతి ఉద్యమానికి.. ఏడాది పూర్తైన సందర్భంగా జరిగే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెదేపా అధినేత చంద్రబాబు సహా ఇతర రాజకీయ పార్టీల నేతలు పాల్గొంటారు. దాదాపు 30వేల మందికిపైగా సభకు వస్తారని ఐకాస నేతలు అంచనా వేస్తున్నారు.

నేడు ఏపీలో 'జనభేరి' సభ.. హాజరుకానున్న చంద్రబాబు
నేడు ఏపీలో 'జనభేరి' సభ.. హాజరుకానున్న చంద్రబాబు

By

Published : Dec 17, 2020, 6:15 AM IST

ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ ఏపీ అమరావతి రైతులు మోగించిన రణభేరికి.... ఏడాది పూర్తైంది. ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకునే వరకూ వెనక్కి తగ్గేది లేదని ఉద్యమిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస సంయుక్తంగా నేడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెంలో సభ నిర్వహణకు పోలీసులు అనుమతించలేదు. రాయపూడి పెట్రోల్ బంకు వెనుక వైపు సీడ్ యాక్సిస్ రోడ్డులో వేదిక ఏర్పాటు చేశారు.

29 గ్రామాల్లో రోజూ వేర్వేరుగా దీక్షలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్న 29 గ్రామాల రైతులు, మహిళలు ర్యాలీగా సభాస్థలికి చేరుకుని ఒక్కటై నినదిస్తారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పొడవునా టెంట్లు వేశారు. ముందు భాగంలో కూర్చునేందుకు కార్పెట్లు పరిచారు. వెనుక వైపు కుర్చీలు వేశారు. అమరావతి ఆవశ్యకత తెలియజెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని దళిత ఐకాస నేతలు ప్రధాన వేదిక పక్కనే మరో వేదికపై సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

సభకు అన్నిపార్టీల నేతలను ఐకాస నేతలు ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభకు హాజరు కానుండగా, జనసేన, భాజపా తరఫున ప్రతినిధులు వస్తారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొంటారు. అమరావతి ఉద్యమం ఐదుకోట్ల ఆంధ్రుల కోసం చేస్తున్నదనే విషయాన్ని సభద్వారా చాటుతామని.. ఐకాస నేతలు చెప్పారు. అమరావతి మద్దతుదారులు జిల్లాల నుంచి తరలిస్తారని ఐకాస నేతలు తెలిపారు. 30వేల మందికి పైగా వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చే వారికి భోజనం, మంచినీరు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యమంలో పొల్గొన్న మహిళలు.. వంటకాలు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చదవండీ... హైకోర్టు సీజేగా జస్టిస్‌ హిమా కోహ్లి నియామకం

ABOUT THE AUTHOR

...view details