తెలంగాణ

telangana

ETV Bharat / state

కోడెలది ప్రభుత్వం చేసిన హత్య: చంద్రబాబు - కోడెలది ఆత్మహత్య కాదు... ప్రభుత్వం చేసిన హత్య

ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు పార్థివదేహానికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం కోడెల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాజకీయ వేధింపులే కోడెల ఆత్మహత్యకు కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెలది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యేనని చంద్రబాబు విమర్శించారు.

'అక్రమ కేసుల వేధింపులే... కోడెల మరణానికి కారణం'

By

Published : Sep 17, 2019, 12:40 AM IST

Updated : Sep 17, 2019, 7:55 AM IST

'అక్రమ కేసుల వేధింపులే... కోడెల మరణానికి కారణం'

దివంగత నేత కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి నివాళులర్పించడానికి తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. నేరుగా హైదరాబాద్​ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లి కోడెల పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు లోకేశ్‌, తెదేపా నేతలు కోడెల భౌతికదేహానికి నివాళులు అర్పించారు. కోడెల కుటుంబసభ్యులను పరామర్శించారు.

ప్రజల కోసం పని చేసిన వ్యక్తి కోడెల అని చంద్రబాబు కొనియాడారు. రాజకీయ వేధింపులే ఆత్మహత్యకు కారణమన్నారు. పులిలాంటి వ్యక్తి కోడెల ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేశారని చంద్రబాబు ఆరోపించారు. కుర్చీలు, బెంచీలు తీసుకుపోయారని ఆరోపణలు చేసి వేధించారన్నారు. కోడెలది ఆత్మహత్య కాదు... ప్రభుత్వం చేసిన హత్యగా చంద్రబాబు అభివర్ణించారు.

పల్నాడును కాపాడుకోవాలని తపించిన వ్యక్తి కోడెల అన్న చంద్రబాబు... ఆయన మరణంతో ప్రజలు ఓ మంచి నాయకుడిని కోల్పోయారని ఆవేదన చెందారు. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారని ఏపీ ప్రభుత్వాన్ని తెదేపా అధినేత ప్రశ్నించారు. కోడెల ఆత్మహత్యకు పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఓ వైపు కోడెల ఆత్మహత్య చేసుకుంటే... అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వక్తం చేశారు. కోడెల కుమారుడు విదేశాల్లో ఉంటే మానవత్వం లేకుండా ఆయనపై కూడా ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ఇవీ చూడండి: 'అ'కాలం చేస్తున్న తెలుగుదేశం నేతలు

Last Updated : Sep 17, 2019, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details