ఆంధ్రప్రదేశ్‌కు ప్రజారాజధానిగా అమరావతే కొనసాగాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. అమరావతిని నాశనం చేస్తూ.. మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లోకి వెళదామని చంద్రబాబు అన్నారు. అమరావతి రెఫరెండంలో.. మూడు రాజధానులు కావాలనుకుంటే... తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని చంద్రబాబు ప్రకటించారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ సిద్ధమా అని సవాలు చేశారు.
వైకాపా వినాశనం తప్పదు..
అమరావతి ఆడపడచుల ఆగ్రహ జ్వాలకు వైకాపా నామరూపాలు లేకుండా పోతుందని..తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుడి సామ్రాజ్యం కూలిపోయిందని.. అమరావతి ఉద్యమం చేస్తున్న మహిళలను అవమానించిన వైకాపాకు అదే గతి పడుతుందన్నారు. అమరావతి రైతులు సాగిస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు కొనియాడారు. తమకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్న రైతులు, మహిళలను వైకాపా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులని ముద్ర వేస్తోందని ధ్వజమెత్తారు.
దుర్గమ్మ చూస్తోంది...
ప్రభుత్వ అరాచకాలను బెజవాడ కనకదుర్గమ్మ చూస్తోందని చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులపై జరుపుతున్న దాష్టీకంపై దుర్గమ్మ మూడోకన్ను తెరుస్తుందని. ఈ ప్రభుత్వం కనిపించకుండా పోతుందన్నారు.
కులముద్ర వేస్తారా..?
"ఒక సామాజిక వర్గంలో పుట్టడం నా తప్పా..? " అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి ఉద్యమంలో దళితులు, బలహీనవర్గాలు, అగ్రవర్ణాల ప్రజలు... కుల, మతాలకతీతంగా పోరాటం చేస్తుంటే అమరావతిపై కులముద్ర వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అమరావతిలో ఉద్యమం చేస్తున్నది ఎవరో వచ్చి చూడాలన్నారు.