తెలంగాణ

telangana

ETV Bharat / state

గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడ: చంద్రబాబు - చంద్రబాబు వార్తలు

గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆడపిల్లల పాలిట మేనమామగా ఉంటానన్న వ్యక్తి .. వారి పట్ల కంసుడిలా తయారయ్యారని మండిపడ్డారు. ఏపీలోని అనంతపురంలో హత్యకు గురైన స్నేహలత కుటుంబానికి తెదేపా తరఫున 2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడ: చంద్రబాబు
గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడ: చంద్రబాబు

By

Published : Dec 24, 2020, 5:31 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్​పై ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఎస్సీ యువతి స్నేహలతదని ఆక్షేపించారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని బాధితురాలి తల్లి వాపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ జీవితమే ఒక ఫేక్ అని ధ్వజమెత్తారు. చట్టమే రాని దిశ చట్టానికి పోలీసు స్టేషన్లు పెట్టి వాహనాలు పంపిణీ చేశారని.... అదే దిశ పోలీస్ స్టేషన్ కు స్నేహలత తల్లి ఫోన్ చేస్తే స్పందన లేదని విమర్శించారు. 19 నెలల్లో జరిగిన హత్యాచారాలు, ఆడబిడ్డలపై వేధింపులు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. అనంతపురం జిల్లాలోనే వరుసగా మూడు సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయని చంద్రబాబు నిలదీశారు. వైకాపా అరాచకాలకు అడ్డు అదుపు లేదా అని ధ్వజమెత్తారు.

జగన్ ఫేక్ వ్యక్తి

ఆడపిల్లల మానానికి రక్షణ కల్పించలేని దద్దమ్మ ప్రభుత్వం వైకాపాదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇన్ని దారుణాలు జరిగితే ముఖ్యమంత్రి పులివెందుల నుంచి అనంతపురం వెళ్లలేరా? అని ప్రశ్నించారు. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ మనుషుల్ని మనుషుల్లా చూడట్లేదని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి రాజకీయ కక్షల కోసం పోలీసుల్ని వాడటం రాష్ట్రానికి చేటని విమర్శించారు. వివేకానందరెడ్డిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినప్పుడే జగన్ ఫేక్ వ్యక్తని తేలిపోయిందన్నారు. డబ్బుల వ్యామోహం, స్వప్రయోజనాల కోసం ముందుకు పోతున్నారు తప్ప రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు.

అందుకే జేసీ కుటుంబంపై దాడి

స్నేహలత హత్య ఘటనను మళ్లించేందుకే జేసీ కుటుంబంపై దాడి చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. సమాజం కోసం పనిచేసిన నాయకుల విగ్రహాలు కూలగొట్టి రౌడీలు, నేరస్థుల విగ్రహాలు పెడతారా? అంటూ ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో గౌతు లచ్ఛన్న విగ్రహాన్ని కూలగొడతాననటం దుర్మార్గమని మండిపడ్డారు. బీసీల ఓట్లు తీసుకుంటూ వారి పతనం కోరుతూ మనోభావాలను అన్ని విధాలా దెబ్బతీస్తున్నారని విమర్శించారు. కరుడగట్టిన నేరస్థులు కాబట్టి కిందవాళ్లని కూడా ఉగ్రవాదుల్లా తయారు చేస్తారా? అని నిలదీశారు. ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం అడిగితే నమ్మి పూనకం వచ్చినట్లు ఓట్లేశారని... ఆరోజు ముద్దులు పెట్టి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ధ్వజమెత్తారు.

అన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలి

స్నేహలత ఘటనతో పాటు రాష్ట్రంలో జరిగిన ఇతర సంఘటనల్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. బాధ్యులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వైకాపా ఆటవిక పాలనలో ఎవరికీ రక్షణ లేదని విమర్శించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా అని ప్రశ్నించారు. గొప్పలు చెప్తున్న డీజీపీకి శాంతిభద్రతలు సమర్థంగా అమలవుతున్నాయని చెప్పే ధైర్యం ఉందా అని సవాల్‌ విసిరారు.

స్నేహలత కుటుంబానికి 2 లక్షల సాయం

స్నేహలత తల్లి మాదిరి రాష్ట్రంలో మరే తల్లీ బాధపడకుండా ప్రతి ఒక్కరూ స్పందించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే అంతా కలిసి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలన్నారు. స్నేహలత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున 2 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. తాడో పేడో తేల్చుకుందాం అంటే తప్ప పోలీసులు దారికి రారని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు న్యాయం జరగాలంటే ఒక్కో మహిళ వీరనారీలా పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:'పాతబస్తీలో సంఘవిద్రోహ శక్తులను 15 నిమిషాల్లో గుర్తించొచ్చు'

ABOUT THE AUTHOR

...view details