ఏపీ సీఎం జగన్ ఉన్మాదంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. 'కోర్టు చీవాట్లు పెట్టినా.. మొట్టికాయలేసినా పట్టించుకోని దుర్మార్గుడు జగన్' అని ధ్వజమెత్తారు. తెదేపా కార్యాలయాలు, ఇళ్లపై దాడికి నిరసనగా 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరిట చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షలో చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు కదిలి వచ్చిన కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా తీరుపై మండిపడ్డారు. తమది ధర్మపోరాటమని... ముమ్మాటికీ విజయం తమదేనని స్పష్టం చేశారు.
ఈ మద్యం బ్రాండ్లు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా ?
తెదేపా హయాంలో మద్యం నియంత్రణ పారదర్శకంగా జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. మద్యం విధానాన్ని క్రమబద్ధీకరించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. మద్యం బ్రాండ్లు మార్చేందుకు ఏ ముఖ్యమంత్రి అయినా సాహసించారా ? అని ప్రశ్నించారు. ఏపీలోని మద్యం బ్రాండ్లు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా? అని నిలదీశారు. దశల వారీగా మద్యపానం నిషేధిస్తానని చెప్పిన జగన్... ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్నారన్నారు. ప్రజలు మత్తుకు బానిసై కొవిడ్ వేళ శానిటైజర్లు కూడా తాగారని గుర్తు చేశారు.
కేసీఆర్‌కు ఉన్న తీరిక జగన్‌కు లేదా?
విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో రూ.లక్ష కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. డ్రగ్స్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి.. డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామన్నారు. సీఎం జగన్‌కు మాత్రం డ్రగ్స్‌పై సమీక్ష నిర్వహించే తీరిక లేదా ? అని ప్రశ్నించారు. గంజాయిపై మాట్లాడితే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారని ఆక్షేపించారు. ఆధారాలు ఇస్తాం..పోలీసులు యూనిఫాం తీసేసి..గంజాయి విచారణ మాకే ఇవ్వండని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు బానిసైతే యువత చేతికి వస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
అప్పుడు జగన్ చిన్నపిల్లాడు
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ బూతులు మాట్లాడలేదని చంద్రబాబు అన్నారు. పట్టాభి మాటలకు వైకాపా నాయకులు కొత్త అర్థాలు చెబుతున్నారని ఆక్షేపించారు. రాజకీయం కోసం జగన్.. తన తల్లిని, చెల్లిని ఉపయోగించుకుంటున్నారన్నారు. జైలుకెళ్లినప్పుడు జగన్ తన తల్లిని ఊరూరా తిప్పారని... చెల్లిని జగనన్న బాణం అని యాత్రలు చేయించారన్నారు. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు తెలంగాణలో తిరుగుతుందని ఎద్దేవా చేశారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని సీఎం రాష్ట్రానికేం చేస్తారని నిలదీశారు. తాను తొలిసారి సీఎం అయినప్పుడు జగన్ చిన్న పిల్లాడన్న చంద్రబాబు..వివేకాను తానే చంపించానని గతంలో ఆరోపించారన్నారు. తాము చేసేది ధర్మ పోరాటమని ముమ్మాటికీ విజయం తమదే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:Nara Lokesh: 'గుర్తుపెట్టుకోండి.. ఇది ట్రైలర్ మాత్రమే.. పిక్చర్ అబీ బాకీ హై'