ఏపీ విజయనగరం జిల్లా బోడికొండ కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతోంది. తెదేపా, భాజపా, వైకాపా నేతల పర్యటనతో రామతీర్థం రణరంగంగా మారింది. పూర్తిగా ఎటు చూసినా రాజకీయ వేడి కనిపిస్తోంది. నాటకీయ పరిణామాల నడుమ తెదేపా అధినేత చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. కోనేరును పరిశీలించిన ఆయన... వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం తెదేపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేవుడి సేవ కంటే పవిత్రమైన పని లేదన్నారు. వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ కుళ్లిపోయాయన్న ఆయన... దేవాలయాలపై దాడులు జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
ఉత్తరాంధ్ర అయోధ్యలో రాముడికి అవమానం జరిగిందని వ్యాఖ్యానించారు. తెదేపా హయాంలో ఎప్పుడూ ప్రార్థనా మందిరాలపై దాడులు జరగలేదని చెప్పారు. దేవాలయాలను కాపాడే బాధ్యత ఏపీ సీఎం జగన్‌కు లేదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. రామతీర్థంలో ఏ-2కి ఏం పని దుయ్యబట్టారు.
'రాముడి విగ్రహం ధ్వంసం చేశారని తెలిసి అందరూ బాధపడ్డారు. విగ్రహాలను ధ్వంసం చేసేవాళ్లు పరమ కిరాతకులు. దేవుడి ఆస్తులపై కన్నేస్తే మసైపోతారు.. జాగ్రత్త. దేవాలయాల వద్దకు వెళ్లి క్రైస్తవం ప్రచారం చేస్తారా..? పరమత విద్వేషం ఎందుకని ప్రశ్నిస్తున్నా?. ముఖ్యమంత్రి విజయనగరం వచ్చినా రామతీర్థం ఘటనపై మాట్లాడారా..?. కనీసం ఆలయానికి వచ్చి పరిశీలించాల్సిన బాధ్యత ఆయనకు లేదా..? ఆర్డీవో, తహసీల్దార్‌కు బాధ్యత లేదా..? తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై తర్వాత చర్యలు తప్పవు' - చంద్రబాబు, తెదేపా అధినేత