అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేశామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడు తొలిరోజు మాట్లాడిన ఆయన... తెదేపా కార్యకర్తల కృషిని కొనియాడారు. 38 ఏళ్లుగా కార్యకర్తలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. భుజాలు అరిగేలా తెదేపా జెండాలు మోశారని అన్నారు. కుటుంబ సభ్యులు హత్యకు గురైనా వెనుకంజ వేయలేదని చెప్పారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే బాటలో నడిచామన్నారు. తెదేపా పాలనలో వినూత్న పద్ధతిలో అభివృద్ధి చేశామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా చేసిన ఘనత తెదేపాదేనన్న ఆయన... జంట నగరాలకు తోడుగా సైబరాబాద్‌ను నిర్మించామని చెప్పారు. తెదేపా హయాంలో అభివృద్ధి ఇప్పుడు తెలంగాణలో మంచి ఫలితాలను ఇస్తోందన్నారు.
కార్యకర్తలకు పాదాభివందనం
గడిచిన ఏడాది దురదృష్టకర సంవత్సరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీశారన్న ఆయన... వైకాపా నేతలు ఉన్మాదులు మాదిరిగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయని తప్పుకు తెదేపా కార్యకర్తలు జైళ్లకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారని... ఆర్థికంగా కుంగదీసినా, హింసించినా పార్టీ వీడని కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.
"ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా..? రాయలసీమకు నీళ్లు రావాలంటే గోదావరి జలాలు చాలా ముఖ్యం. కృష్ణా జలాల పంపిణీలో రెండు రాష్ట్రాలు న్యాయం చేసుకోవాలి'