కరోనాకు సంబంధించి ఏపీలో ఎన్440కె స్ట్రైన్ వ్యాప్తి దృష్ట్యా లాక్డౌన్ విధించాలని తెదేపా అధినేత చంద్రబాబు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం, ఇసుకలో తీసుకునే కమీషన్లను కరోనా నివారణకు మళ్లిస్తే నిధుల సమస్య రాదని హితవు పలికారు. కరోనా తీవ్రతపై ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. పలు అంశాలపై చర్చించారు. ఎన్440కె స్ట్రైయిన్.. ఇతర వైరస్లతో పోల్చితే 10 రెట్లు అధిక ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు చెప్తుండటంతో పాటు.. ఈ రకం కరోనా వైరస్ను కర్నూలులోనే తొలిసారిగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు కనుగొన్నారని గుర్తు చేశారు. ఏపీలో ఇప్పటికే ఇది 30 శాతం వ్యాప్తి చెందిందన్నారు.
కరోనా తీవ్రంగా ఉంది.. లాక్ డౌన్ విధించాలి: చంద్రబాబు - ఏపీలో లాక్ డౌన్
కరోనా తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా లాక్ డౌన్ విధించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. పథకాల ప్రచారం కోసం దుబారా ఖర్చు చేయకుండా.. కరోనా బాధితులకు ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు.
రాష్ట్రంలో పడకల కొరత ఉందని ఏపీ వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సింఘాల్ అంగీకరించారని వెల్లడించారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చకుండా నివారించేందుకు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒడిశాలో ఇప్పటికే 14రోజుల లాక్డౌన్ విధించారని చంద్రబాబు గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాల తరహాలోనే ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్ల కొనుగోళ్లకు ఆర్డర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంపై నిందలు మోపేందుకు, గోరంత పథకాలను కొండంతలుగా ప్రచారం చేసుకునేందుకు ప్రకటనల కోసం రూ. వందల కోట్లు దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రంగుల కోసం రూ. 3000 కోట్ల దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఈ దుబారాను అరికట్టి కరోనా బాధితులకు ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించాలన్నారు.
ఇదీ చదవండి:ప్రతిధ్వని: రాజకీయం మలుపు తిరుగుతుందా?