Chandrababu Consoled Families Of Kandukur Victims: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ వస్తున్నా కార్యకర్తల భావోద్వేగంతో దురదృష్టకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న తన కళ్ల ముందే జరిగిన ఘటన ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. విధి వక్రీకరించి, దేవుడు చిన్నచూపు చూసినప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఓ కుటుంబ పెద్దగా వారి బాధ్యత తీసుకుంటా:బాధితుల కుటుంబ సభ్యుల ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేవని.. కానీ ఓ కుటుంబ పెద్దగా వారి బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను చేసే ఉద్యమం రాష్ట్రం కోసమన్న ఆయన.. చనిపోయిన వారు రాష్ట్రం కోసం సమిధులుగా మారారని అన్నారు. మృతుల కుటుంబాలు వేర్వేరు గ్రామాల్లో ఉన్నా చంద్రబాబు అందరి ఇళ్లకూ స్వయంగా వెళ్లి మృతుల భౌతికకాయాలు, చిత్రపటాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
తొలుత ఓబూరులో గడ్డం మధు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు వారికి పరిహారం చెక్కును అందచేశారు. అనంతరం గుర్రంవారిపాలెం వెళ్లి కాపుమాని రాజా కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత కొండమురుసుపాలెంలో కలవపూరి యానాది కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
"నేను కూడా చాలా సార్లు రోడ్‌షోలు చేశా. తర్వాత రాజశేఖర్ రెడ్డి కూడా చేశాడు. ఇది బాధాకరమైన ఘటన. ఇలాంటివి జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు ఇరుకు రోడ్లలో మీటింగ్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నన్ను చూడని ప్రజలు ఎవరూ లేరు. కందుకూరులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నేను మాత్రమే కాదు చాలా రాజకీయ పార్టీలు కూడా మీటింగులు అక్కడే పెట్టాయి" - చంద్రబాబు, టీడీపీ అధినేత