CBN ON NTR AS CHIEF MINISTER : స్వర్గీయ నందమూరి తారక రామారావు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు.. తెలుగు జాతి చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజని ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీర్తించారు. తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుతోనే తెలుగు వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు.
పేదరికం లేని సమాజం కోసం టీడీపీ ఆవిర్భావం: తెలుగు జాతి ప్రయాణాన్ని.. 1983లో తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం ముందు.. ఆ తర్వాత అని చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నాటి దారుణ రాజకీయ పరిస్థితులు, ప్రజల వెతలు చూసిన ఎన్టీఆర్.. పేదరికం లేని సమాజం కోసం పార్టీ పెట్టి.. 9 నెలల్లో అధికారం చేపట్టారని స్పష్టం చేశారు. 40 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజల మధ్యకు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఎన్టీఆర్ ప్రమాణం స్వీకారం చేసి.. తెలుగు ప్రజల జీవితాల్లో పెను మార్పులకు నాంది పలికారని వెల్లడించారు.
విప్లవాత్మకమైన కార్యక్రమాల ఘనత టీడీపీకే సాధ్యం: రెండు రూపాయలకు కిలో బియ్యం, భూమి శిస్తు రద్దు, సింగిల్ విండో విధానం, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, 50 రూపాయలకే రైతులకు హార్స్ పవర్ విద్యుత్, మహిళలకు ఆస్తి హక్కు, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, వృద్ధులకు పింఛన్లు, జనతా వస్త్రాలు వంటి అనేక సంక్షేమ, విప్లవాత్మకమైన కార్యక్రమాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీ, మహిళల కోసం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది తమ ప్రభుత్వమే అని అన్నారు.
బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే:రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కింది టీడీపీ ఆవిర్భావంతోనే అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. నాటి ప్రభుత్వం, పాలనలో బీసీలకు ప్రాధాన్యం, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ద్వారా బీసీల రాజకీయ ఎదుగుదలకు నాంది పలికిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపు, మైనారిటీలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటుతో వారి జీవితాల్లో వెలుగు తెచ్చిందని తెలిపారు.
గ్రామాలు, మండల, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున స్కూళ్లు, కాలేజీలు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా అణగారిన వర్గాలకు విద్యను చేరువ చేసిందని అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసం తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీగా టీడీపీ ఎప్పటికీ నిలిచిపోతుందని స్పష్టం చేశారు.