Chandrababu on Samaikya Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. అలాంటి ఘటనలపై దృష్టి పెట్టకుండా మళ్లీ సమైక్య రాష్ట్రం అంటూ ప్రభుత్వం ప్రకటన లేంటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చెప్పాలంటే రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలతో ప్రజలు నిరాశా నిస్పృహలతో ఉంటే, వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టడం లేదన్నారు. తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు కలవాలి, కలపాలి అంటూ ప్రజలను గందరగోళంలోకి నెడుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తోందని దుయ్యబట్టారు.
ఏపీ విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ, మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితమని ఆక్షేపించారు. ప్రభుత్వ పెద్దలు ముందు ఆ తప్పులను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే సమైక్య రాష్ట్ర ప్రకటనలు ఆపి రైతుల ఆత్మహత్యలు, ప్రజల సమస్యలకు కారణాలు విశ్లేషించాలని కోరారు. వ్యవసాయరంగ వృద్ధిలో, ఆక్వా ఎగుమతుల్లో నాడు రికార్డులు సృష్టించిన రాష్ట్రం, ఇప్పుడు మూడేళ్లలో 1673 రైతు ఆత్మహత్యలతో సూసైడ్స్ స్టేట్‌గా మారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.