Chandrababu vs police: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ బ్రిటిష్ వాళ్ల కంటే ఘోరంగా తయారయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా సొంత నియోజకవర్గానికి వస్తున్న ఆయనను ఏపీ సరిహద్దులో బాదూరువద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నడిరోడ్డుపైనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనను ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో స్పష్టతివ్వాలని పోలీసులను ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో డీఎస్పీ అక్కడికి రాగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
చంద్రబాబు: అనుమతి అడిగితే తిరస్కరించామన్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా వచ్చా. నా ప్రజలతో నేను మైకులో మాట్లాడాలనుకుంటున్నా. మీరు ఎక్కడ అనుమతి ఇస్తారు? ఎందుకు ఇవ్వరో స్పష్టంగా చెప్పాలి. నా కార్యక్రమాలకు ఎందుకు అనుమతివ్వలేదో చెప్పాలని నేరుగా అడుగుతున్నా. నా నియోజకవర్గానికి రాకుండా నేను పారిపోవాలా?
డీఎస్పీ: మేం వెళ్లమని చెప్పలేదు.
చంద్రబాబు: ఐదు కోట్ల ప్రజల తరఫున మిమ్మల్ని అడుగుతున్నా. నాకు మైకు ఎందుకివ్వరు? నా రోడ్‌షోకు ఎందుకు అనుమతివ్వరు? నా ప్రజలతో నన్ను మాట్లాడనివ్వకుండా చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారు. నా గత పర్యటనలో ఇదే నియోజకవర్గంలో 74 మంది తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టారు. పది మందిని అరెస్టు చేసి, నెల రోజులు జైల్లో పెట్టారు. నన్నూ జైల్లో పెట్టండి. అందరికీ బేడీలు వేయండి. నిన్ననే జగన్ వెళ్లాడు.. ఆయన రోడ్డుపై వెళ్లొచ్చా? వైకాపాకు ఒక చట్టం, నాకు ఒక చట్టమా? మీ డీజీపీ, ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
డీఎస్పీ: లిఖితపూర్వకంగా మీరడిగితే ఇస్తాం సార్.
చంద్రబాబు: నేను మౌఖికంగా అడుగుతున్నా. నియోజకవర్గంలో తిరగాలని అడుగుతున్నా.
డీఎస్పీ: నియోజకవర్గంలో తిరిగేందుకు అభ్యంతరం లేదు సార్.
చంద్రబాబు: సమావేశం పెట్టాలని అడుగుతున్నా.
డీఎస్పీ: సమావేశం గ్రామాల్లో పెట్టుకునేందుకు అభ్యంతరం లేదు. రోడ్డుపై అయితేనే అభ్యంతరం.
చంద్రబాబు: మైకు ఎందుకు ఇవ్వలేదు?
డీఎస్పీ: మైకు ఎక్కడ అనేది చెప్పాలని అడిగాం.