30 దాటగానే సాహసాలు చేయడం మా వల్ల కాదు అని చేతులెత్తేస్తున్న యువతకు వీరి విజయాలు ఆదర్శం. ఒకరు సెంచరీకి దగ్గర్లో ఉంటే.. మరొకరు కొంచెం దూరంలో ఉన్నారు. వయసు మీద పడినా ఇబ్బంది లేదు.. ఇంకా విజయాలు సాధిస్తామంటున్నారు ఈ వృద్ధులు. వారు సాధించిన పతకాల సంఖ్య వారి వయసును మించిపోయింది. వాళ్ల గురించి మీరూ తెలుసుకోండి..
వయసు: 98... పతకాలు: వందకు మించి..
..ఇదీ ఈ వృద్ధుడి ఘనత. ఈయన పేరు రామచంద్రారెడ్డి. తిరుపతికి చెందిన వారు. వ్యవసాయదారుడు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నివాసముంటున్నారు. 2003 తన ఎనభయ్యోఏట (2003) మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. గత 18 ఏళ్లలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి 100, 200, 400 మీటర్ల రన్నింగ్ పోటీల్లో పాల్గొని వందకు పైగా పతకాలు గెలుచుకొన్నారు. 5 అంతర్జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాలు పొందారు. ఇప్పటికీ దేశంలోఎక్కడ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు జరిగినా పాల్గొంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.