తెలంగాణ

telangana

ETV Bharat / state

బకాయిలే లక్ష్యంగా.. జీఎస్టీ నిఘా విభాగం సోదాలు - gst raids in hyderabad latest news

జీఎస్టీ, సేవా పన్ను, సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం బకాయిలే లక్ష్యంగా కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం సోదాలు నిర్వహిస్తోంది. బకాయిలో 40 నుంచి 50 శాతం పన్ను చెల్లించేందుకు 'సబ్‌కా విశ్వాస్‌ పథకం' ద్వారా కేంద్రం అవకాశం ఇచ్చినా.. ముందుకు రాని సంస్థలపై సీజీఏస్​టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిఘా విభాగం గుర్తించిన సంస్థలపై కేంద్ర జీఎస్టీ అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించి.. కేసులు నమోదు చేస్తున్నాయి.

Cgst Special team raids in Hyderabad
జీఎస్టీ నిఘా విభాగం సోదాలు

By

Published : Dec 21, 2019, 5:20 AM IST

జీఎస్టీ నిఘా విభాగం సోదాలు

కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన దాడులు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. జీఎస్టీ అమలుకు ముందు పెండింగ్‌ ఉన్న సేవా పన్ను, సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం వసూళ్లే లక్ష్యంగా సోదాలు చేపట్టారు. 2017 జులై కంటే ముందు సేవాపన్ను, సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్నులను సెటిల్మెంట్‌ చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం సబ్‌కా విశ్వాస్‌ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఈనెల చివరన ముగియనున్న గడువు..

ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తుదారులకు చెందిన వడ్డీ, అపరాధ రుసుం పూర్తిగా మాఫీ అవుతుంది. బకాయిగా ఉన్న మొత్తం రూ. 50లక్షలు అంత కంటే తక్కువ ఉంటే 70 శాతం ఉపశమనం కల్పించి కేవలం 30 శాతం కట్టించుకుంటారు. రూ. 50లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే 50 శాతం ఉపశమనం కల్పించి మిగిలిన 50 శాతాన్ని కట్టించుకుంటారు. ఈ పథకం ఈనెల చివర నాటికి గడువు ముగుస్తుంది.

21 ప్రాంతాల్లో దాడులు..

రాష్ట్రంలో ఆరువేలకు పైగా బకాయిదారులు ఉన్నప్పటికీ... ఈ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు రెండున్నర వేల దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర జీఎస్టీ అధికారులు వెల్లడించారు. ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం వల్ల.. కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం అధికారులు రంగంలోకి దిగారు. వారం రోజులుగా ముందుగా ఎంచుకున్న సంస్థలపై కేంద్ర జీఎస్టీకి చెందిన నాలుగు కమిషనరేట్లకు చెందిన అధికారులతో కలిసి ఏర్పాటైన ప్రత్యేక బృందాలతో దాడులు చేస్తున్నారు. అందులో భాగంగా మూడు రోజులు కిందట హైదరాబాద్‌లోని వివిధ సంస్థలపై 21 ప్రాంతాల్లో దాడులు చేసి దాదాపు రూ.40 కోట్లకుపైగా సేవా పన్ను, జీఎస్టీలకు చెందిన మొత్తం బకాయిలను గుర్తించిన అధికారులు ఆయా సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను విశ్లేషిస్తున్నారు.

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఇంట్లో సోదాలు..

శుక్రవారం ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు హైదరాబాద్‌, విజయవాడల్లో వివిధ సంస్థలకు చెందిన 23 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో అధికారుల ప్రాథమిక అంచనా మేరకు రూ.12కోట్లకుపైగా సేవా పన్ను, జీఎస్టీలకు చెందిన మొత్తం ఉంది. జూబ్లీహిల్స్‌లోని హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఇళ్లు, కార్యాలయంపై సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటి వరకు రూ.25 లక్షల వరకు సేవా పన్ను బకాయి ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.

ప్రముఖ సంస్థలపై సోదాలు..

ఓ మీడియా సంస్థపై సోదాలు చేసిన అధికారులు సేవా పన్ను, జీఎస్టీ రెండు కలిపి దాదాపు మూడు కోట్ల మేర బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారత్‌ నుంచి విదేశాలకు విద్యార్థులను పంపే ఓ ప్రముఖ కన్సల్టెన్సికి చెందిన హైదరాబాద్‌, విజయవాడల్లోని ప్రధాన కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు రెండు కోట్ల మేర జీఎస్టీ, సేవా పన్ను చెల్లించాల్సి ఉందని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

కోట్లాది బకాయిలు..

హైదరాబాద్‌లో రెండు ఫిట్​నెస్‌ సెంటర్లపై సోదాలు నిర్వహించిన అధికారులు రూ. 30 లక్షల వరకు జీఎస్టీ బకాయిలు ఉన్నట్లు తేల్చారు. స్థిరాస్తి సంస్థలపై నిర్వహించిన సోదాల్లో... కోట్లాది రూపాయలు జీఎస్టీ, సేవా పన్ను బకాయి ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

సోదాలు చేసినప్పుడు బకాయి ఉన్నట్లు గుర్తించిన సేవా పన్ను, జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలపై అపరాధ రుసుం, వడ్డీ, ప్రత్యేక అపరాధ రుసుం విధింపులాంటి వాటితో 300 శాతం అదనంగా బకాయిదారులు చెల్లించాల్సి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి: 'అత్యంత పారదర్శకంగా నూతన పురపాలక చట్టం'

ABOUT THE AUTHOR

...view details