తెలంగాణ

telangana

ETV Bharat / state

CEO on mlc elections counting: 'ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి' - తెలంగాణ తాజా వార్తలు

CEO on mlc elections counting: స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమయ్యింది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 12 స్థానాలకు 6 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మరో 6 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 5 ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో.. మొదటి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా విజేతను ప్రకటించనున్నారు.

Shashank Goyal
Shashank Goyal

By

Published : Dec 13, 2021, 7:03 PM IST

Updated : Dec 13, 2021, 10:26 PM IST

CEO on mlc elections counting : రాష్ట్రంలోని 5 ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు... రేపు ఉదయం ప్రారంభం కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కోస్థానానికి... కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఆదిలాబాద్​లో ఆరు, కరీంనగర్​లో 9, మిగతా చోట్ల ఐదు టేబుళ్లపై లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. మొదట 25 చొప్పున కట్టలుగా కట్టి ఆ తర్వాత డీటెయిల్డ్ లెక్కింపు చేపడతారని వివరించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లను మొదట లెక్కిస్తారని... లెక్కింపు ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కలెక్టర్లతో సమీక్షించినట్లు వెల్లడించారు.

ర్యాలీలకు అనుమతి లేదు..

లెక్కింపు సందర్భంగా ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ గాని.. ఆర్టీపీసీఆర్ టెస్ట్​ రిపోర్ట్ చూపాలని పేర్కొన్నారు. ఫలితాల తర్వార ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని... గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు వెళ్లాలని సీఈవో స్పష్టం చేశారు.

మెదక్​లో 4 టేబుళ్లు

మెదక్‌ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో.. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్​ తెలిపారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని.. ఓట్ల లెక్కింపుకు 4 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. వాలిడ్ ఓట్లలో సగం కన్నా ఒకటి ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా పరిగణిస్తారని.. ఒక వేళ అన్ని ప్రాధాన్యత ఓట్లు రాకపోతే తక్కువ ప్రాధాన్యత ఓట్లు వచ్చిన మూడో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తామన్నారు. అతనికి రెండో ప్రాధాన్యతగా వచ్చిన ఓట్లను.. ఇరువురు అభ్యర్థులకు కలిపి లెక్కించి.. విజేత అభ్యర్థిని ప్రకటించి ధ్రువపత్రం అందజేస్తామని ఆయన వెల్లడించారు.

మొదటి ప్రాధాన్యత ఓట్లను మొదట లెక్కిస్తారు. కౌంటింగ్​ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశాము. పూర్తి పారదర్శకంగా, కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్​ ప్రక్రియ జరుగుతుంది. -శశాంక్ గోయల్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

ఖమ్మంలో..

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 738 మంది ప్రజాప్రతినిధులు వినియోగించుకున్న ఓటుహక్కు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమవ్వగా.. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. ఉత్కంఠ రేపుతున్న ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికపై.. సర్వత్రా ఆసక్తినెలకొంది.

ఆ స్థానంపై ఉత్కంఠ

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు... అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని.. ఆర్‌వో తెలిపారు. ఎమ్మెల్సీ స్థానాల్లో... ప్రధానంగా కరీంనగర్‌ స్థానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో కరీంనగర్‌ మేయర్‌గా పనిచేసిన రవీందర్‌సింగ్‌.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చూడండి:MLC Elections Counting: రేపే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..

Last Updated : Dec 13, 2021, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details