తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రం నుంచి మళ్లీ నిరాశే.. నాలుగు శాతం కూడా రాని గ్రాంట్లు - తెలంగాణకు కేంద్ర గ్రాంట్లు 2022

Centre grants to Telangana : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం అంచనాను 70 శాతం వరకు, పన్ను ఆదాయం అంచనాను 90 శాతం వరకు అందుకొంది. పన్నుల రూపంలో ఖజానాకు రూ. 1,13,000 కోట్ల సమకూరాయి. కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్ల మొత్తంలో నాలుగో శాతం కూడా రాలేదు. ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,55,000 కోట్ల ఖర్చు చేసింది.

ts income
ts income

By

Published : Mar 30, 2023, 12:51 PM IST

కేంద్రం నుంచి మళ్లీ నిరాశ

Centre grants to Telangana : కంప్ట్రొలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రాబడి రూ.1,33,850 కోట్లుగా ఉంది. బడ్జెట్ అంచనాలో మాత్రం రూ. 1,93,029 కోట్లు.. ఇది 69 శాతానికి పైగా ఉంది. పన్ను ఆదాయం మాత్రం 90 శాతం వరకు అంచనాలను అందుకొంది.

Telangana Income 2022-2023 : బడ్జెట్‌లో రూ. 1,26,606 కోట్ల పన్ను ఆదాయం అంచనా వేయగా.. ఫిబ్రవరి వరకు అందులో 89.75 శాతం మేర.. అంటే రూ. 1,13,634 కోట్లు సమకూరాయి. జీఎస్టీ ద్వారా రూ. 38,265 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.27,132 కోట్లు, ఎక్సైజ్ పన్ను ద్వారా రూ.15,913 కోట్లు ఖజానాకు వచ్చి చేరాయి. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 12,843 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా రూ. 11,750 కోట్లు, ఇతర పన్నుల ద్వారా రూ. 7,729 కోట్ల ఆదాయం సమకూరింది.

రాష్ట్ర ఖజానా ఆదాయ వివరాలు: పన్ను ఆదాయం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఎక్కువగా వచ్చింది. డిసెంబర్‌లో రూ. 11,213 కోట్లు పన్నుల ద్వారా రాగా.. ఫిబ్రవరిలో ఆ మొత్తం రూ.11,436 కోట్లుగా నమోదైంది. పన్నేతర ఆదాయం బడ్జెట్ అంచనాలో సగం కూడా రాలేదు. రూ. 25,421 కోట్లు అంచనా వేస్తే 43 శాతం మేర అంటే రూ. 10,892 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు మాత్రం కనీసం నాలుగో వంతు కూడా లేదు. రూ. 41 వేల ఒక కోటి రూపాయలు గ్రాంట్ల రూపంలో వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. కానీ ఫిబ్రవరి వరకు కేవలం 23 శాతం మేర రూ. 9,324 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 40,485 కోట్ల రూపాయలను ఎఫ్​ఆర్బీఎమ్​ పరిమితికి లోబడి రుణాల ద్వారా సేకరించింది.

రాష్ట్ర ఖజానా ఖర్చుల వివరాలు: ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,55,770 కోట్ల వ్యయం చేసింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,40,365 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ. 15,404 కోట్లు మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 నెలల్లో వడ్డీ చెల్లింపుల కోసం రూ. 18,616 కోట్లు, వేతనాల చెల్లింపుల కోసం రూ. 32,211 కోట్లు, పెన్షన్ల కోసం రూ. 14,415 కోట్లు, రాయితీల కోసం రూ. 9,660 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రంగాల వారీగా ఖర్చు చూస్తే సాధారణ రంగంపై రూ. 45,082 కోట్లు, సామాజిక రంగంపై రూ. 55,748 కోట్లు, ఆర్థిక రంగంపై రూ. 54,938 కోట్లు వ్యయం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details