తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2021, 7:55 PM IST

ETV Bharat / state

genome sequencing : జన్యు విశ్లేషణపై దృష్టి సారించిన కేంద్రం..

genome sequencing: ఒకటే వైరస్. ఎన్నో రూపాలు. అందుకే ఇన్ని సమస్యలు, సవాళ్లు. కరోనా వెలుగులోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా...ఈ వైరస్‌ తీరు కచ్చితంగా ఇది అని చెప్పలేని పరిస్థితి. కాస్తో కూస్తో అంతు చిక్కింది అనుకునే లోపు మరో వేషంలో వ్యాప్తి చెందుతోంది. ఇలా ఇప్పటికి రకరకాల వేరియంట్లు వెలుగు చూశాయి. ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చింది. ఇలా ఇంకెన్ని వస్తాయో తెలియటం లేదు. కానీ.. వాటి జన్యు పటాన్ని విశ్లేషిస్తే.. వ్యాప్తిని నియంత్రించవచ్చని వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే... భారత్‌లో జన్యు విశ్లేషణపై దృష్టి సారించారు. దాదాపు ఏడాదిగా ఇది కొనసాగుతున్నా.. ఇంకా ఏదో లోటు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్‌ వెలుగు చూసిన వేళ మళ్లీ భారత్ అప్రమత్తమై... జీనోమ్ సీక్వెన్సింగ్‌ను వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 8 కీలక నగరాల్లోని ల్యాబ్‌లలో జన్యు విశ్లేషణ జరిపేలా చొరవ తీసుకుంటోంది.

genome sequencing
genome sequencing

జన్యు విశ్లేషణపై దృష్టి సారించిన కేంద్రం..

genome sequencing : ఇంకెన్ని కరోనా వేరియంట్లు వస్తాయి..? ఎన్ని రోజులు ఇలా భయపడుతూ ఉండాలి..? అసలు కరోనా మనల్ని వదిలి పోదా..? ఇలా ఎన్నో సందేహాలు. ఈ విషయాల్లో స్పష్టత వచ్చేది.. కేవలం జన్యు విశ్లేషణతోనే అంటున్నారు పరిశోధకులు. అందుకే... గతేడాది ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ల సమయంలోనూ జీనోమ్ సీక్వెన్సింగ్‌కున్న ప్రాధాన్యత ఏమిటో వివరించారు. వీరి సలహాలు, సూచనల మేరకే... గతేడాది నవంబర్ 23 దేశవ్యాప్తంగా పాజిటివ్ వస్తున్న వారిలో 5% నమూనాలను సీక్వెన్సింగ్ చేయాలని నిర్ణయించింది కేంద్రం. డిసెంబర్ 22న ప్రత్యేకంగా ఇండియన్ సార్స్ కోవీ 2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్షియా-ఇన్సకాగ్‌ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా క్రియాశీలకంగా పని చేస్తున్న 10ల్యాబ్‌లను ఇందులో భాగస్వామ్యం చేస్తూ... ఆయా ల్యాబ్‌లలో కరోనా వైరస్‌కి సంబంధించిన జీనోమ్‌ సీక్వెన్సింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అలా మొదలైన విశ్లేషణ...ఇప్పటికీ కొనసాగుతోంది.

ఏడు రాష్ట్రాల్లో 8 నగరాల్లో..

Delta and omicron variant : డెల్టా విధ్వంసం తరవాత దేశంలో ఏ వేరియంట్‌ ఉనికి లేకపోవటం వల్ల జీనోమ్ సీక్వెన్సింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. మళ్లీ ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ దేశంలోనూ విస్తరించటం వల్ల మరోసారి ఈ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. క్రమక్రమంగా ఇక్కడ ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య పెరుగుతుండటాన్ని గుర్తించిన మోదీ సర్కార్... పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వారి నుంచి వైరస్ నమూనాలు సేకరించి వెంటనే జన్యు విశ్లేషణకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఏడు రాష్ట్రాల్లోని 8 నగరాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుండటాన్ని గమనించిన కేంద్రం... ఈ నిర్ణయం తీసుకుంది. ముంబయి, పుణె, దిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, భువనేశ్వర్, కోల్‌కత్తా నగరాల్లో ప్రస్తుతం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు ప్రక్రియ విస్తృతంగా సాగుతోంది.

వీలైనంత ఎక్కువగా జీనోమ్ సీక్వెన్సింగ్‌ చేస్తేనే..

The National Center for Disease Control : ది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్- (ఎన్​సీడీసీ) NCDC ఇప్పటికే జీనోమ్ సీక్వెన్సింగ్‌పై అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి చెందక ముందే వీలైనంత వేగంగా ఈ వేరియంట్ గుట్టు తేల్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసలు ఇప్పటికే సామాజిక వ్యాప్తి దశలో ఉందా లేదా అన్నదీ జన్యు విశ్లేషణతో తెలుసుకునే వీలుంటుంది. వాస్తవానికి ఈ వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు పెద్దగా కనిపించటం లేదు. ఫలితంగా... తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోంది. దిల్లీలో దాదాపు 30 మంది అనుమానితులను గుర్తించే పనిలో ఉన్నారు అక్కడి అధికారులు. ఇలా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలోనూ ఉన్నారు. ఇది చాప కింద నీరుగా విస్తరించక ముందే మేల్కొంటే మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. ఎన్‌సీడీసీ జన్యు విశ్లేషణ చేయాలని అప్రమత్తం చేయటం వెనక ఉద్దేశమూ ఇదే. నగరాల్లో వీలైనంత ఎక్కువగా జీనోమ్ సీక్వెన్సింగ్‌ చేస్తే...అక్కడి వైరస్ వ్యాప్తి ఏ దశలో ఉందో అర్థమవుతుంది. ముప్పు ముంగిట ఉన్నామని అర్థమైతే..ఆంక్షలు విధిస్తూ..కట్టడి చేసేందుకు వీలుంటుంది.

దేశవ్యాప్తంగా 38 ల్యాబుల్లో

genome sequencing labs in india : వైరస్ తీరు అంచనా వేయటం.. తగిన జాగ్రత్తలు తీసుకోవటం..! ప్రస్తుతానికి కరోనా కట్టడికి అనుసరించాల్సిన విధానమిదే. అంటే...వైరస్ జన్యు పటాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. శాస్త్రీయ భాషలో చెప్పాలంటే... జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. మూడో వేవ్‌ వస్తుందా? రాదా? వస్తే తీవ్రత ఎలా ఉంటుందనే సందేహాలకు శాస్త్రీయంగా సమాధానం దొరకాలంటే ఎప్పటికప్పుడు వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణ తప్పనిసరి. ప్రపంచమంతా ఇప్పుడిదే పనిలో పడింది. వైరస్ వ్యాప్తి తీరు, ప్రభావం, స్వరూపం లాంటి అంశాల్లో స్పష్టత రావాలంటే జన్యు విశ్లేషణే కీలకం. అత్యంత నిపుణులైన శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియ నిర్వహిస్తుంటారు. భారత్‌లో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆధ్వర్యంలో ఈ విశ్లేషణ చేపడతారు. ఇందులో భాగంగానే దేశంలో... గతేడాది నవంబర్ 23 దేశవ్యాప్తంగా పాజిటివ్ వస్తున్న వారిలో 5% నమూనాలను సీక్వెన్సింగ్ చేయాలని నిర్ణయించింది కేంద్రం. తొలి దశలో దేశవ్యాప్తంగా 10 ల్యాబ్‌లలో విశ్లేషణ మొదలవగా.. తరవాత వీటి సంఖ్య 38కి పెరిగింది. మౌలిక వసతులనూ కల్పించింది ప్రభుత్వం.

మహమ్మారి కొమ్ములు వంచాలంటే..

genome sequencing process : జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ... ఆశించిన స్థాయిలో నమూనాలు విశ్లేషించటం లేదన్న వాదన వినిపిస్తోంది. కొవిడ్‌ రెండో వేవ్‌ తీవ్రంగా ఉన్న జూన్‌లో గరిష్ఠ స్థాయిలో చేపట్టిన వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌.. జులై, ఆగస్టుకు వచ్చేసరికి పడిపోయింది. పాజిటివ్‌ కేసులు తగ్గడం వల్ల వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణను తగ్గించేశారు. మూడో వేవ్‌ వస్తే అందుకు కొత్త వేరియంటే కారణమవుతుందనే నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ గుర్తించేందుకు నిరంతర పర్యవేక్షణ, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఒమిక్రాన్‌ విస్తరిస్తోందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎక్కువగా వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణలతో ఎక్కువ సమాచారం అందుబాటులోకి వస్తుంది. అప్పుడే వైరస్‌ కొమ్ములు వంచేందుకు అవకాశం చిక్కుతుంది.

ఒక్కో చోట ఒక్కో విధంగా

దేశవ్యాప్తంగా ఈ డిసెంబర్ 4 నాటికి లక్షా 26 వేలకు పైగా నమూనాల్లోని వైరస్‌ను సేకరించి జన్యు క్రమాలను కనుగొన్నట్టు సమాచారం. రెండోవేవ్‌లో మనదేశాన్ని వణికించిన డెల్టాలోని ఉత్పరివర్తనాలలో 13 ఉపరకాలు ఉన్నట్లు తేల్చారు. ఇంకా కొత్త ఉత్పరివర్తనాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో మొత్తం వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణలో మహారాష్ట్ర ముందంజలో ఉంటోంది. ఇప్పుడు దేశరాజధాని దిల్లీలోనూ ఈ ప్రక్రియ వేగవంతమైంది. రోజుకు కనీసం 400-500 వరకూ నమూనాలను విశ్లేషించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆప్‌ సర్కార్. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఇప్పటికే సీసీఎమ్‌బీలో జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలో ఓ ల్యాబ్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అత్యంత ఎక్కువ జనాభా కల్గిన ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ అరశాతమే ఉంటోంది. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా విశ్లేషణ జరుగుతుండటమూ సమస్యలు తెచ్చి పెడుతోంది.

యూకేలో 15రోజులు, ఇడియాలో వంద రోజులు

వైరస్‌ నమూనాల్లో నాణ్యమైన వాటినే సీక్వెన్సింగ్‌కు ఎంపిక చేసుకుంటారు. కరోనా సోకి ఆస్పత్రిపాలైన వ్యక్తుల నమూనాలు, టీకా వేసుకున్నా ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన, వైరస్‌తో చనిపోయిన వ్యక్తులు.. ఇలా వేర్వేరుగా నమూనాలను ఎప్పటికప్పుడు సేకరించి వేగంగా ల్యాబ్‌కు పంపాలి. అక్కడ జన్యుక్రమాలను కనుగొని దేశీయంగా ఇన్సాకాగ్, అంతర్జాతీయంగా జీఐఎస్‌ఏఐడీకి పంపాలి. ఈ ప్రక్రియ యూకేలో 15 రోజుల్లో జరుగుతుంటే.. మన దగ్గర నుంచి సమాచారం వెళ్లేందుకు వంద రోజులు పడుతోంది. ఈ సమయాన్ని భారత్‌లో తగ్గించగలిగితే ముందున్న ముప్పును ప్రారంభ దశలోనే గుర్తించి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందన్నది నిపుణుల మాట. టీకా వేసుకున్న వారిలో వైరస్‌ ఎక్కువ పోరాడుతూ కొత్త ఉత్పరివర్తనాలకు దారితీసే అవకాశం ఉంది. వైరస్‌ బలంగా ఉందా.. బలహీనంగా ఉందా తెలియాలంటే ఎప్పటి కప్పుడు జన్యుక్రమ ఆవిష్కరణ జరగాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఒక్కో శాంపిల్​ టెస్టింగ్​కు రూ.10 నుంచి 15 వేలు

ఈ జీనోం సీక్వెన్సింగ్ చేసేందుకు నిర్దుష్ట విధి విధానాలను కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా కరోనా సోకిన పిల్లల నమూనాలు, గ్రామీణ ప్రాంతాల నమూనాలు సేకరిస్తారు. వీటితో పాటు ఎక్కువగా కరోనా కేసులు వెలుగు చూస్తున్న ప్రాంతాల నుంచి కొన్ని శాంపిళ్లు, సూపర్ స్ప్రెడ్డింగ్ ఈవెంట్లు, వ్యాక్సిన్ వేసుకున్న రెండు వారాల తర్వాత కూడా కరోనా సోకిన వారికి సంబంధించిన సాంపిళ్లతో ఈ సీక్వెన్సింగ్ చేస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో సరైన పద్ధతిలో సేకరించి... ఆర్‌టీపీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయిన నమూనాలను ఇన్సకాగ్ ల్యాబ్​లకు పంపుతారు. అక్కడ ఆయా నమూనాల నుంచి ఆర్ఎన్ఏ సేకరించి ల్యాబ్ లలో ప్రత్యేక పద్ధతుల్లో జెనెటిక్ సీక్వెన్స్ చేస్తారు. ఒక్కో నమూనాకు సంబంధించిన ఆర్ఎన్ఏ ఎక్స్ ట్రాక్షన్, జెనెటిక్ స్టడీ పూర్తి చేసేందుకు పది రోజుల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో నమూనా అధ్యయనం చేసేందుకు 10నుంచి 15వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

టెస్టుల సంఖ్య పెరగాలి

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌తో...వైరస్‌లోని జన్యుపదార్థాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా మనకు ఒమిక్రాన్ వైరస్ సోకిందా లేదా డెల్టా వేరియంట్ బారిన పడ్డామా అనే అంశాన్ని శాస్త్రవేత్తలు ధ్రువీకరిస్తారు. ఈ ఫలితాలను ఆధారంగా చేసుకొని, కొత్త వేరియంట్ ఏ స్థాయిలో వ్యాపించగలదో శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వస్తారు. దక్షిణాఫ్రికా, యూకేలోని శాస్త్రవేత్తలు ఈ సాంకేతికత విషయంలో ముందంజలో ఉన్నారు. నవంబర్‌ 15-22 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 14 వందల 89 నమూనాలు విశ్లేషించినట్టు తెలుస్తోంది. నవంబర్‌ 22-29 మధ్య కాలంలో ఈ సంఖ్య 2,136కు పెరిగింది. ఒమిక్రాన్‌ కలవరంతో ఎక్కువ మొత్తంలో నమూనాలు సేకరించటమే ఇందుకు కారణం. ఒక్కో వారంలో నమోదవుతున్న కేసులలో సగటున 3-3.5% మేర సీక్వెన్సింగ్ చేస్తున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4 మధ్య కాలంలో ఏకంగా 4 వేల 480 నమూనాలు విశ్లేషించారు. ప్రస్తుతానికి ఇది ఆశాజనకంగానే ఉన్నా...దీనిపై మరింత దృష్టి సారించాలని ఎన్‌సీడీసీ సూచిస్తోంది.

మూడో ముప్పు ఆందోళనల నేపథ్యంలో కేంద్రం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు ప్రాధాన్యతనిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా...ఈ సారి పకడ్బందీగా ఈ ప్రక్రియను నిర్వహించి...సామాజిక వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది.

ఇదీ చూడండి:Minister Harish on Omicron : 'పండుగలొస్తున్నయ్.. జర భద్రంగా ఉండండి'

ABOUT THE AUTHOR

...view details