రాష్ట్రం చేస్తున్న అప్పులపై కేంద్రం స్పందించింది. ఇష్టారీతిగా రుణాలు తీసుకొని ఖర్చు చేయకూడదని స్పష్టం చేసింది. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి స్థూల జాతీయోత్పత్తి ఎంత ఉండొచ్చని అంచనా వేశారో అందులో కేవలం 4శాతం మేర మాత్రమే నికర రుణంగా ఉండాలని తేల్చింది. అంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న మొత్తం రుణంలో.. తిరిగి చెల్లించిన అప్పును మినహాయిస్తే నికర రుణ పరిమితి ఎంతన్నది తేటతెల్లమవుతుంది. ఇందులో భాగంగానే పదిహేనో ఆర్థిక సంఘం నిర్దేశించిన ఫార్ములా ప్రకారం రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి 10 లక్షల 61 వేల 802 కోట్ల రూపాయలను స్థూల జాతీయోత్పత్తిగా అంచనా వేసింది. ఆ లెక్కన రాష్ట్రానికి నికర రుణ పరిమితిని 42 వేల 472 కోట్ల రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఈ నికర రుణ పరిమితిని దాటకూడదని స్పష్టం చేసింది.
నాలుగు పేజీల సమగ్ర లేఖ..
బహిరంగ మార్కెట్, ఆర్థిక సంస్థల నుంచి బేరమాడి తీసుకునేవి, చిన్న తరహా పొదుపు మొత్తాలు, విదేశీ ఆర్థిక సాయం కింద కేంద్రం ఇచ్చే రుణం, ప్రావిడెంట్ ఫండ్, చిన్న మొత్తాల పొదుపు, రిజర్వు నిధులు, డిపాజిట్ల రూపంలో వినియోగించుకునే రుణం.. ఇవన్నీ దీనిలోకి వస్తాయని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర ఆర్థికశాఖ నాలుగు పేజీల సమగ్ర లేఖను పంపింది.
నికర రుణ పరిమితిలో కోత!
స్థూల జాతీయోత్పత్తిలో నిర్దిష్టంగా కొంత మొత్తం మూలధన వ్యయంగా ఖర్చు చేయాల్సిందేనని పేర్కొంది. అలా ఖర్చు చేయని పక్షంలో నికర రుణ పరిమితిలో 0.50శాతం మేర కోత విధిస్తామని తెలియజేసింది. రాష్ట్రాలు కచ్చితంగా ఇంత మొత్తాన్ని పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేయాలని కేంద్రం పరిమితి విధిస్తోంది. 2021-22లో రాష్ట్రం 27 వేల 589 కోట్ల రూపాయలను పెట్టుబడి వ్యయంగా ఖర్చు చేయాలని నిర్దేశించింది. ఆ ప్రకారం ఖర్చు చేయకపోతే జీడీపీలో 0.50 శాతం అంటే...5 వేల కోట్ల రూపాయలకపైగా నికర రుణ పరిమితిలో కోత పెట్టనుంది.