వచ్చే ఏడాది నుంచి దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం తరపున బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకల్లో కేంద్ర మహిళా మంత్రులు, అధికారులను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. హిమాయత్ నగర్ భాజపా కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో నారాయణగూడ కేశవ మెమోరియల్ కాలేజీ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
నిజాం పాలనలో రజాకార్ల రాక్షసత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆడపడుచులు బతుకమ్మ ఆడారని కేంద్ర మంత్రి తెలిపారు. పూలతో భగవంతున్ని పూజించడనే కాకుండా.. పూలనే పూజించే సంస్కృతి, సంప్రదాయాల బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బతుకమ్మ పండుగకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో, ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పల్లెల, పట్టణాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం నగరంలోని సీతారాంబాగ్లో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కిషన్ రెడ్డి హాజరయ్యారు. బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యం ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.