తెలంగాణ

telangana

ETV Bharat / state

CENTRAL TO NGT: పనులు ఆపామన్న ఏపీ.. ఆపలేదన్న తెలంగాణ

ngt
ఎన్‌జీటీ

By

Published : Sep 8, 2021, 3:22 PM IST

Updated : Sep 9, 2021, 4:06 AM IST

15:20 September 08

రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్‌జీటీకి కేంద్రం నివేదిక

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చెందిన పనులను జులై 7 నుంచి నిలిపివేశామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి నివేదించింది. పనులు ఆపలేదని, కొనసాగుతూనే ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. పనులు చేయడంలేదన్న ఏపీ తరఫు న్యాయవాది హామీని రికార్డు చేసిన ఎన్జీటీ తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి గత ఏడాది అక్టోబరు 29న ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, దీనికి బాధ్యులైన అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ జి.శ్రీనివాస్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్జీటీ జ్యుడిషియల్‌ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సాంకేతిక సభ్యులు డాక్టర్‌ కె.సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఏపీ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది

ఎత్తిపోతల పనులకు సంబంధించిన నివేదికను సమర్పించినట్లు కేంద్రం తరఫు న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పనులూ జరగడంలేదని, అనుమతులు కోరుతూ ఏపీ ప్రభుత్వం చేసిన దరఖాస్తు పెండింగ్‌లో ఉందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పనులు నిలిపివేశామని ఏపీ ప్రభుత్వమే చెబుతోందని, ఉల్లంఘనలపై స్పష్టతనివ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ పనులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను పెన్‌డ్రైవ్‌లో సమర్పించామన్నారు.

కావాలంటే మీరు సందర్శించవచ్చని, లేదంటే అనుమతిస్తే డ్రోన్ల ద్వారా ఫొటోలు తీయిస్తామనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ రేపు వాళ్లు కూడా మీ ప్రాజెక్టులపై డ్రోన్లకు అనుమతించాలంటారని వ్యాఖ్యానించింది. ఏపీ తరఫున వెంకటరమణి, దొంతి మాధురిరెడ్డి వాదనలు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం పనులు జరుగుతున్నట్లు ఇచ్చిన వివరాలను తమకు అందజేయలేదనగా .. వాటిని ఇవ్వాలంటూ ధర్మాసనం తెలంగాణకు సూచించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ కేంద్రం ఏపీకి అనుకూలంగా ఉండటంతో వారికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వలేదన్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు తన నివేదికలో ఏపీ ప్రభుత్వం పనులు చేసినట్లు పేర్కొందని, దీన్ని ఆ ప్రభుత్వమూ అంగీకరించిందన్నారు. పనులు ఆపాలని ట్రైబ్యునల్‌ చెప్పలేదని, డీపీఆర్‌ నిమిత్తమే అయితే ఎందుకు ఆపారో తెలియడంలేదన్నారు. ఏపీ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ పిటిషనర్లు ప్రాసిక్యూషన్‌కు అడుగుతున్నారని, ట్రైబ్యునల్‌ పరిధిపై వాదనలు వినిపిస్తామని, ఎలాంటి పనులు జరగడం లేదని హామీ ఇస్తున్నామనగా విచారణను ట్రైైబ్యునల్‌ వాయిదా వేసింది.

ఇదీ చూడండి: NGT: సీమ ఎత్తిపోతలపై కేంద్ర పర్యావరణ శాఖ, కృష్ణా బోర్డులకు ఎన్జీటీ ఆదేశం

Last Updated : Sep 9, 2021, 4:06 AM IST

ABOUT THE AUTHOR

...view details