State on Loans: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం... అందుకు గత రెండేళ్లలో తీసుకున్న బడ్జెట్ వెలుపలి రుణాలను కారణంగా చూపుతోంది. ఈ రుణాలను ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్- ఎఫ్ఆర్బీఎంతో సంబంధం లేకుండా బడ్జెట్ వెలుపలే తీసుకున్నప్పటికీ... చెల్లింపులను మాత్రం బడ్జెట్ నిధుల నుంచే చేస్తున్నారని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బడ్జెట్ నిధుల నుంచే చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో వాటిని కూడా ఎఫ్ఆర్బీఎం కిందకే పరిగణిస్తామని అంటోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, జలవనరుల వసతుల అభివృద్ధి, రహదారి అభివృద్ధి కార్పొరేషన్ తదితరాల ద్వారా బడ్జెట్ వెలుపల రుణాలను తీసుకొంది.
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇలా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న వివిధ రుణాల మొత్తం 50 వేల కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చని సమాచారం. దీంతో ఆ మొత్తాన్ని ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి లోబడి తీసుకున్న అప్పులుగా పరిగణించి ఆ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రతిపాదించిన అప్పుల్లో భాగంగా పరిగణించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తీసుకునే అప్పుల మొత్తం భారీగా తగ్గనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎంకు లోబడి 59వేల కోట్ల రుణాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్రం తన ప్రతిపాదనను అమలు చేస్తే రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల కోట్ల లోపు మాత్రమే అప్పులు తీసుకునే అవకాశం లభిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే అనుమతులు లేని కారణంగా నీటిపారుదల ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వబోమని కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్పష్టం చేశాయి.
పన్నుల ద్వారా వచ్చే సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే వాటా, గ్రాంట్లతో పాటు రుణాలను కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసింది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, రుణాల వడ్డీ చెల్లింపులు, వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు, చేసిన పనులకు గుత్తేదార్లకు బిల్లులు సహా ఇతరత్రా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. పన్నుల ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులను కలిపితే వేతనాలు, పెన్షన్లు, రుణాల వడ్డీ చెల్లింపులు, విద్యుత్ రాయతీకి మాత్రం సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు పూర్తయ్యే సరికి చాలా ఆలస్యం అవుతోంది. కేంద్రం అప్పులకు అనుమతి ఇవ్వకపోతే ఇక మిగతావన్నీ అటకెక్కినట్లే అంటున్నారు. నిధులు లేకపోతే సంక్షేమ పథకాల అమలు, చేసిన పనులకు చెల్లింపులు కష్టమే. రైతుబంధు, దళితబంధు పేరిట రెండు భారీ సంక్షేమ పథకాలకు నిధులు పెద్దమొత్తంలో అవసరం. అప్పులకు కేంద్రం అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రుణాలకు సంబంధించి రాష్ట్ర వాదనను, రాష్ట్ర పరిస్థితులను కేంద్రానికి వివరించారు.