తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ పంపిణీ వ్యవస్థల ప్రైవేటీకరణ దిశగా రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి - privatization of power distribution systems latest news

విద్యుత్‌ పంపిణీ (డిస్కంల) వ్యవస్థలను ప్రైవేటీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడిని పెంచుతోంది. వ్యవసాయ రాయితీలను రద్దుచేసే దిశగా ప్రోత్సహిస్తోంది. మూడు రోజుల కిందట కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రాలకు ఈ మేరకు 19 పేజీల లేఖ రాసింది.

విద్యుత్​ పంపిణీ వ్యవస్థల ప్రైవేటీకరణ దిశగా రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి
విద్యుత్​ పంపిణీ వ్యవస్థల ప్రైవేటీకరణ దిశగా రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి

By

Published : Jun 13, 2021, 5:24 AM IST

అరశాతం అదనపు అప్పును ఆశగా చూపి దేశవ్యాప్తంగా విద్యుత్‌ పంపిణీ (డిస్కంల) వ్యవస్థలను ప్రైవేటీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడిని పెంచుతోంది. వ్యవసాయ రాయితీలను రద్దుచేసే దిశగా ప్రోత్సహిస్తోంది. మూడు రోజుల కిందట కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రాలకు ఈ మేరకు 19 పేజీల లేఖ రాసింది. ‘‘విద్యుత్తు రంగంలో రాష్ట్రాలు కనబరిచే పనితీరు ఆధారంగా జీఎస్‌డీపీలో 0.50% అదనపు రుణ సేకరణకు రాష్ట్రాలకు అనుమతివ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పింది. దీని ప్రధాన ఉద్దేశం విద్యుత్తు రంగం నిర్వహణ, ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగు పరిచి, వినియోగించే ప్రతి యూనిట్‌ విద్యుత్తుకు బిల్లింగ్‌ జరిగేలా చూడటమే! ఏటా 0.5% అదనపు అప్పు తీసుకోవాలంటే వచ్చే నాలుగేళ్లూ ఈ రంగం సంస్కరణల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అప్పుడే అర శాతం అదనపు రుణ పరిమితి వర్తిస్తుంది’’ అని కేంద్ర ఆర్థికశాఖ వ్యయ విభాగం ఈ లేఖలో స్పష్టం చేసింది. రాష్ట్రాల విద్యుత్తు సంస్థల పనితీరు మెరుగు పరుచుకోవడానికి పలు షరతులు కూడా విధించింది.

ఇవీ ఆ షరతులు

* ప్రభుత్వ రంగంలోని డిస్కంలకు వచ్చే నష్టాలన్నింటినీ రాష్ట్రాలు భరించాలి. వచ్చే నాలుగేళ్లలో తొలి ఏడాది 60%, మలి ఏడాది 75%, మూడో ఏడాది 90%, నాలుగో ఏడాది 100% డిస్కం నష్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని చెల్లింపులు చేయాలి.
* లేదంటే అందుకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ఆర్థిక లోటు కింద పరిగణించి, రాష్ట్రాల అప్పుల స్వీకరణపై పరిమితులు విధిస్తారు.
* డిస్కంలు- బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర సంస్థలు, విద్యుత్తు విక్రయదారులకు చేయాల్సిన చెల్లింపులు, అప్పుల గురించి ప్రతినెలా ప్రకటించాలి. అప్పులు తగ్గాయా, పెరిగాయా అనే లెక్కలను 2022 జనవరి 31నుంచి నెలవారీగా వెల్లడించాలి. 2020-21కి సంబంధించిన వార్షిక ఆడిట్‌ లెక్కలను అక్టోబర్‌ 31కల్లా ప్రచురించాలి.
* ప్రభుత్వం చెల్లించని రాయితీ లెక్కలను, రుణ హామీలను వార్షిక లెక్కల ఖాతాల్లో ప్రత్యేకంగా చూపించాలి. బకాయిలను సంవత్సరాలవారీగా విశ్లేషించాలి.
* ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను వార్షిక లెక్కల్లో ప్రత్యేకంగా చూపెట్టాలి.
* రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకు సబ్సిడీ ఇస్తే- ఎవరెవరికి యూనిట్ల వారీగా ఎంత సబ్సిడీ ఇస్తున్నారో చెప్పాలి

వ్యవసాయ సబ్సిడీ తీసేస్తే పూర్తి మార్కులు

పైన చెప్పిన షరతులకు కట్టుబడతామన్నంత మాత్రాన అరశాతం రుణానికి మార్గం సుగమం అవదు. షరతుల అమలు తీరును ప్రత్యేక కొలమానాల ద్వారా కొలిచి మార్కులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
* అంతటా మీటర్లు బిగించి విద్యుత్‌ కొలిస్తే 20 మార్కులు
* రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్‌ రాయితీలు ఎత్తేస్తే 20 మార్కులు
* ఒకవేళ వ్యవసాయ విద్యుత్తు రాయితీ అమలు చేసినా ఆ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా చేస్తే ప్రతి 5% మొత్తానికి ఒక మార్కు.
* వ్యవసాయ విద్యుత్తు వినియోగం తగ్గించిన రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇందుకోసం అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించి, నెలవారీ విద్యుత్తు కోటా పరిమితి విధించాలి. పరిమితిలోపు విద్యుత్తు వినియోగించిన రైతులకు నగదు రూపంలో ప్రోత్సాహకం చెల్లించాలి. ఈ పథకం కింద 5% రైతులు చేరితే ఒక మార్కు! ఎన్ని 5 శాతాలు పెరిగితే అన్ని మార్కులు.
* రాష్ట్రంలో 50% విద్యుత్తు పంపిణీని (డిస్కమ్‌లను) ఇదివరకే ప్రైవేటీకరించి ఉంటే బోనస్‌ కింద 25 మార్కులు. కనీసం 10% విద్యుత్తు పంపిణీ వ్యవస్థనైనా ప్రైవేటీకరించి ఉంటేనే ఈ మార్కులు.
* 2022 డిసెంబర్‌ 31లోపు కనీసం 15% మేర విద్యుత్‌ పంపిణీని ప్రైవేటీకరించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు విధాన నిర్ణయం ప్రకటిస్తే 25 బోనస్‌ మార్కులు.
* 10%, అంతకుమించి డిస్కంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, డిస్ట్రిబ్యూషన్‌ ఫ్రాంచైజీలాంటి నూతన విధానాలకు శ్రీకారం చుడితే కనీసం 10 బోనస్‌ మార్కులు.
* ఈ షరతులను అమలు చేయకపోతే ఏ రాష్ట్రానికీ అదనపు రుణ సౌకర్యం లభించదు.
* షరతుల అమలు తీరులో 15 లోపు మార్కులకే పరిమితమైతే కేవలం 0.35% రుణానికి మాత్రమే అనుమతి. 30 మార్కులు మించి సాధిస్తేనే 0.50% అదనపు రుణం లభిస్తుంది.
* తొలుత చెప్పిన ప్రాథమిక షరతులను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోతే వాటికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేవలం 0.15% రుణ సేకరణకు మాత్రమే అనుమతిస్తారు. అది కూడా ఈ ఏడాది డిసెంబర్‌ 31లోపు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ సబ్సిడీలను రైతులకు నగదు బదిలీ రూపంలో చెల్లిస్తేనే ఈ వెసులుబాటు.

షరతుల మీద షరతులు

అడుగడుగునా రకరకాల షరతులు, నిబంధనలు పెడుతూ రాష్ట్రాలకు విధిలేని పరిస్థితిని కేంద్రం కల్పిస్తోంది. కరోనా పరిస్థితుల్లో ఆర్థిక వనరులు కుచించుకుపోవడంతో రాష్ట్రాలు అదనపు రుణాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ అదనపు రుణ పరిమితి వల్ల గరిష్ఠంగా రూ.3,000 కోట్లకు మించిన ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. అయినప్పటికీ అవి కేంద్రం విధించిన షరతులకు తలొగ్గే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇలాంటి అదనపు రుణం కోసం స్థానిక సంస్థల సంస్కరణలకు అంగీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంచాల్సి వచ్చింది. విద్యుత్‌ రంగంలో షరతులు కూడా ఇదే తరహాలో సాగుతాయనే భావన వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి: Current bill: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. దంపతుల మధ్య చిచ్చు

ABOUT THE AUTHOR

...view details