తెలంగాణ

telangana

ETV Bharat / state

POLAVARAM: పోలవరంలో కోత పెట్టిన నిధులిస్తాం! - Polavaram funds cut

పోలవరం ప్రాజెక్టు అంచనా నిధుల్లో గతంలో కోతపెట్టిన తాగునీటి విభాగం నిధులు ఇచ్చేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించినట్లు తెలిసింది. గతంలో మినహాయించిన రూ. 4,068 కోట్లు తిరిగి ఇచ్చేందుకు సమ్మతించినట్లు పోలవరం అధికారులకు సమాచారం ఇచ్చింది.

POLAVARAM
పోలవరం ప్రాజెక్టు

By

Published : Aug 5, 2021, 9:57 AM IST

ఆంధ్రప్రదేశ్​ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అంచనా నిధుల్లో గతంలో కోత పెట్టిన తాగునీటి విభాగం నిధులు ఇచ్చేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు మినహాయించిన రూ.4,068.43 కోట్లు తిరిగి ఇచ్చేందుకు సమ్మతించినట్లు పోలవరం అధికారులకు వర్తమానం అందింది. ఈ విషయాన్ని జల్‌శక్తి శాఖ కేంద్ర ఆర్థికశాఖకు కూడా నివేదించినట్లు తెలిసింది. ఈ ఫైలు పరిష్కార దిశలో ఉందని జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు.

రూ.20,398.61 కోట్లు ఇవ్వాలని లేఖ..

2020 అక్టోబరు నుంచి పోలవరం నిధులపై కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య భిన్నాభిప్రాయాలు పరిష్కరించుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఒక లేఖ రాసింది. 2014 ఏప్రిల్‌ 1 నాటికి సాగునీటి విభాగం కింద పోలవరం ప్రాజెక్టుకు మొత్తం రూ.20,398.61 కోట్లు ఇవ్వాలని అందులో పేర్కొంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటికి ఈ నిధుల్లో ఇవ్వాల్సింది రూ.15,667.90 కోట్లుగా లెక్కగట్టింది. అప్పటికే రూ.8,614.16 కోట్లు ఇచ్చినందున ఇక పోలవరానికి ఇవ్వాల్సింది రూ.7,053 కోట్లేనని తేల్చిచెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హతాశురాలయింది. పోలవరం డీపీఆర్‌-2 ఆమోదించుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్న క్రమంలో కేంద్ర ఆర్థికశాఖ ఈ లేఖ రాయడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2013-14 ధరల ప్రకారం అంచనాలు ఆమోదిస్తూనే, కొత్త డీపీఆర్‌ ప్రకారం నిధులివ్వకపోతే ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యంకాదని 2020 నవంబరు 2న నిర్వహించిన సమావేశంలో పోలవరం అథారిటీ స్పష్టం చేసింది. అప్పటి నుంచి కొత్త డీపీఆర్‌ ఆమోదం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

విభాగాల వారీగా చూపి నిధుల కోతలా?

ఇతర జాతీయ ప్రాజెక్టుల్లో తాగునీరు, సాగునీరు అని విభాగాలుగా విడగొట్టి చూడటం లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో కూడా చర్చ వచ్చింది. అలాంటప్పుడు ఇక్కడ తాగునీటి విభాగం నిధుల్లో కోత పెట్టడం సరికాదని పోలవరం అధికారులు పేర్కొంటున్నారు. విభాగాల వారీగా చూసి నిధులు కోత పెట్టడం సరికాదని రాష్ట్రం అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసింది. తాగునీటి విభాగం కింద 2014 ఏప్రిల్‌ 1 లెక్కల ప్రకారం కోత పెట్టిన రూ.4,068 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకారం తెలియజేసి ఫైలు ఆర్థికశాఖకు పంపినట్లు తెలిసింది. దీంతో తొలి దశలో ఇప్పటి వరకు ఉన్న ఆమోదం విలువ రూ.24,467.04 కోట్లకు పెరగనుంది. విద్యుత్తు విభాగం కింద డీపీఆర్‌లో రూ.3,529.33 కోట్లు ఉంటే కేంద్ర ఆర్థికశాఖ ఆ విభాగం కింద కోత పెట్టిన మొత్తం అంతకన్నా ఎక్కువ ఉందని కూడా రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు కేంద్రానికి తెలియజేశారు. ఆ తేడా మొత్తాన్నీ కలిపి ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు రూ.47,725.74 కోట్ల డీపీఆర్‌-2కు పెట్టుబడి అనుమతులు రావాలి. దీనిపై పోలవరం అథారిటీ కొర్రీలు వేయగా జలవనరుల శాఖ అధికారులు సమాధానాలు పంపారు. ప్రస్తుతం రూ.419.90 కోట్ల నిధులకు సంబంధించిన దస్త్రం అన్ని ఆమోదాలు పొందింది. ఆ నిధులు రావాల్సి ఉన్నాయి.

ఇదీ చదవండి..Urea Shortage: వేధిస్తోన్న కొరత.. సరఫరాలోనే 4.85 లక్షల టన్నుల కోత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details