‘భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు బియ్యం(Rice) ఇచ్చేందుకు గడువు పొడిగించటం కుదరదు. ఆ బియ్యాన్ని ఇప్పటికే కేంద్ర కోటా (సెంట్రల్ పూల్) నుంచి తొలగించాం’ అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే రాష్ట్రానికి స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు. బియ్యం ఇచ్చేందుకు మరో 30 రోజుల గడువు ఇవ్వాల్సిందిగా సీఎస్ ఈ ఏడాది మే, జూన్ నెలల్లో కేంద్రానికి లేఖలు రాశారు. ‘ఇప్పటికే కేంద్రం అయిదు దఫాలు గడువు పొడిగించినా మిల్లర్లు స్పందించకపోవటంతో గడువు పొడిగించేది లేదు’అని కేంద్రం ఏప్రిల్‌లో రాసిన లేఖలో స్పష్టం చేసింది. అయినప్పటికీ గడువు ఇవ్వాల్సిందిగా సీఎస్ కేంద్రాన్ని కోరారు.
అక్రమాలకు అవకాశం
ఈ నేపథ్యంలో ‘‘ఒకటికి మించిన సీజన్లకు సంబంధించిన బియ్యాన్ని సకాలంలో ఇవ్వకపోవటం కారణంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. భవిష్యత్తులోనైనా మిల్లర్ల నుంచి సకాలంలో బియ్యం ఎఫ్‌సీఐకి చేరేలా ప్రణాళికను రూపొందించాలి’’అని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 2019-20 సంవత్సరపు యాసంగి (రబీ) సీజనుకు సంబంధించిన సుమారు 1.01 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. నిజానికి ఈ బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు.
25,303 టన్నులు మాయం