భాజపా అభ్యర్థి రాంచంద్ర రావు ఎమ్మెల్సీగా మళ్లీ గెలిస్తే కౌన్సిల్లో సమస్యగా ఉంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని కేంద్ర మంత్రి, భాజపా నేత ప్రకాశ్ జావడేకర్ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో పట్టభద్రుల పాత్ర అనే అంశంపై.. సికింద్రాబాద్లో భాజపా నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. రాంచంద్ర రావు కౌన్సిల్ ప్రసంగాల పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు.
100 శాతం బదిలీ
కుటుంబ పార్టీలు తెలంగాణకు న్యాయం చేయలేవని, దేశాన్ని మరో మెట్టు ఎక్కించిన కమలం అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన కోరారు. దేశం మొత్తం భాజపాను ఇష్టపడుతున్నారని.. ఇటీవల గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి నిరూపించాయని కేంద్ర మంత్రి అన్నారు. రాజీవ్ గాంధీ కాలంలో వంద రూపాయలు పేదల కోసం కేటాయిస్తే.. కేవలం 15 రూపాయలు ప్రజలకు వెళ్లేవన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా.. 100 శాతం పేదలకు చేరుతున్నాయన్నారు. బెంగాల్లో ఈ సారి గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కాలంలో మన దేశం చాలా ప్రాంతాలను కోల్పోయామని.. కానీ ఇప్పుడు మొదటి సారిగా ప్రత్యర్ధులు వెనక్కి వెళ్తున్నారని చెప్పారు.
ఇప్పుడు కూడా అంతే నిరుద్యోగులు
ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ అధికార పార్టీ.. అబద్ధపు ప్రచారాలకు శ్రీకారం చుట్టిందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్ర రావు ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో.. ఇప్పుడు కూడా అంతే ఉన్నారని తెలిపారు. కేటీఆర్ విడుదల చేసిన ఉద్యోగాల సంఖ్యలో.. పర్మినెంట్ చేసిన వారి సంఖ్య కూడా ఉందని వెల్లడించారు.