Central minister on auction of coal blocks: తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ మొదలైందని కేంద్ర గనుల మంత్రిత్వశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి స్పష్టం చేశారు. వేలం ప్రక్రియలో నిర్హేతుకంగా వ్యవహరించడం లేదని తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన 20ఏళ్ల పాటు లాభాలు సాధిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సమీపంలోని కోల్‌బ్లాక్‌లను వేలం వేయాలనే నిర్ణయం సరికాదని పేర్కొన్నారు. నాలుగు కోల్‌బ్లాక్‌లను వేలాన్ని తక్షణం ఉపసంహరించి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇందుకు సమాధానం చెప్పిన ప్రహ్లాద్‌జోషి... బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను సమర్థించుకున్నారు. గత కాంగ్రెస్ హయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసనని గుర్తుచేశారు. సింగరేణి కార్మికుల సమ్మె రాష్ట్రప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమని ఆరోపించారు.
ఆ నిర్ణయం సరైంది కాదు..
ఇది చాలా తప్పుడు నిర్ణయం. గనుల శాఖకు సింగరేణికి కోల్‌బ్లాక్‌లను కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ కార్మికులు సమ్మె చేపట్టారు. దీని వల్ల 120కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సింగరేణి కాలరీస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ విద్యుత్ కేంద్రాల బొగ్గు అవసరాలు తీర్చుతోంది. ఇందు కోసం సింగరేణికి కోల్‌బ్లాక్‌లు కేటాయించాల్సిపోయి వేలానికి వెళ్లడం సహేతుకం కాదు. ఈ నాలుగు కోల్‌బ్లాక్‌ల వేలం ప్రక్రియను రద్దుచేసి సింగరేణికి కేటాయించాలి.-ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ