Central Minister Kishan Reddy: దేశంలో 8 ఏళ్ల తర్వాత నరేంద్రమోదీ నేతృత్వంలో సమర్థవంతమైన పాలనను అందిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్డీయే నేతృత్వంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నామని పేర్కొన్నారు. గతంలో ఈశాన్య రాష్ట్రాలు బంద్‌లు రాస్తారోకోలతో అట్టుడికేవని... భాజపా పాలనలో అన్ని తగ్గాయన్నారు. ధరలు తగ్గించే అవకాశం లేకపోవడంతో పెట్రోల్ మీద వేసే పన్నుల భారాన్ని కేంద్రం తగ్గించిందన్నారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాలు అర్థికంగా నిలదొక్కుకోవాలని కేంద్ర పన్నుల వాటాలో 42శాతానికి పెంచినట్లు స్పష్టం చేశారు. పన్నుల రూపంలో వచ్చే డబ్బులను మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తున్నామని తెలిపారు.
ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్‌తో 3లక్షల మరణాలు తగ్గించామన్నారు. గత 74 ఏళ్లుగా రావణకాష్టంగా ఉన్న కశ్మీర్లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి తద్వారా జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. కరోనా కోసం 8రకాల వ్యాక్సిన్లు తయారు చేస్తున్నామని అభివృద్ది చెందిన దేశాలు మన వ్యాక్సిన్‌లు అడుగుతున్నారన్నారు. కొవిడ్ కారణంగా అనాథలైన పిల్లలకు పీఎం కేర్ ద్వారా దత్తత తీసుకున్నామని... వారికి గార్డియన్‌గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉంటారని వివరించారు. ఆ పిల్లల పేర్ల మీద 10లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని దానిపై వచ్చే వడ్డీ కూడా వారికే వస్తుందన్నారు.