భారత్‌లో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకూ దేశంలో ఎలాంటి మరణాలు సంభవించలేదని, ప్రజలుకూడా చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. చైనాలో కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో భారత్‌లో పరిస్థితులను సమీక్షించి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి మోదీ ఏర్పాటుచేసిన మంత్రుల టాస్క్ఫోర్సులº సభ్యుడిగా ఉన్న జి.కిషన్‌రెడ్డి తాజా స్థితిగతులపై ‘ఈటీవీ భారత్’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
1. కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వపరంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు?
మన దేశం నుంచి వేలాదిమంది వ్యాపారులు రోజూ చైనాకు వెళ్లివస్తుంటారు. వైద్యవిద్య కోసం వెళ్లిన ఎంతో మంది విద్యార్థులు అక్కడ ఉంటున్నారు. వీరి సౌకర్యార్థం భారతీయ రాయబార కార్యాలయం 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. సరిహద్దు దేశమైన భారత్ మరింత జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి మంత్రులు, అధికారులతో వేర్వేరు టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటుచేశారు. అధికారుల టాస్క్‌ఫోర్స్ రోజూ కలుస్తోంది. మంత్రులు అవసరమైనప్పుడల్లా కలుస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులు, అధికారులతో చర్చించి అక్కడ ఎప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ విశ్లేషిస్తున్నాం. ఏం చేయాలో చెబుతున్నాం.
2. చైనా నుంచి వచ్చిన వారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నాం?
చైనా నుంచి మనవాళ్లు ఇప్పటికి వెయ్యి మందికిపైగా వచ్చారు. వారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన పర్యవేక్షణ కేంద్రాల్లోనే ఉంచి పరీక్షించాలని చెప్పాం. రాష్ట్రాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల పనితీరు, సౌకర్యాలు, మందుల లభ్యతను పరిశీలించడానికి కేంద్రం అన్ని రాష్ట్రాలకూ అధికారులను పంపింది. కరోనా వైరస్ నివారణకు మన భారతీయ సంప్రదాయ వైద్య విధానాల్లో ఏమైనా ఉందేమో కనుక్కోమని ఆయుష్ డిపార్ట్మెంట్కు సూచించాం. విషజ్వరాలు వచ్చినప్పుడు మన ఆయుర్వేద, హోమియోపతిల్లో చాలా రకాల మందులు వాడుతున్నారు. వాటి ఆధారంగా కొన్ని మందులను గుర్తించారు.
3. మంత్రుల టాస్క్‌ఫోర్స్ ఇప్పటివరకూ ఏం చేసింది?
ఇప్పటివరకూ రెండుసార్లు సమావేశమైంది. చైనాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, ఏ మందులు వాడుతున్నారన్న దానిపై విభిన్న దేశాలను అడిగి తెలుసుకుంటోంది. ఏ దేశంలో మందులు అందుబాటులో ఉన్నా తెప్పించుకోవాలని నిర్ణయించింది.
4. కరోనా వైరస్ నిర్ధారణ ఎలా జరుగుతోంది?
కరోనా వైరస్ గుర్తింపే అసలు సమస్య. ఈ వైరస్‌ను గుర్తించేందుకు అనువైన కొలమానం మన దగ్గర ఇంతవరకూ లేదు. అందుకే ఆ విషయాన్ని చైనానే అడిగి తెలుసుకున్నాం. హాంకాంగ్‌లో జరుగుతున్న పరీక్షలతో దాన్ని పోల్చుకొని ఆ వివరాలను అన్ని రాష్ట్రాలకూ పంపించి దేన్ని కరోనా వైరస్‌గా గుర్తించాలో స్పష్టంగా చెప్పాం.