తెలంగాణ

telangana

ETV Bharat / state

' ప్రగతిభవన్​ను భవిష్యత్​లో​ తెలంగాణ ప్రజాభవన్​గా మారుస్తాం' - central minister kishan reddy news

Kishan Reddy on pragathi bhavan: కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తెరాస నేతలు పబ్బం గడుపుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెరాస నేతల ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో.. రాష్ట్ర సర్కారు ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి సవాల్​ విసిరారు. ఇప్పుడు ప్రగతిభవన్​ కల్వకుంట్ల ప్రగతిభవన్​గా ఉందని.. దానిని భవిష్యత్​లో​ తెలంగాణ ప్రజాభవన్​గా మారుస్తామని కిషన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Kishan Reddy: ' ప్రగతిభవన్​ను భవిష్యత్​లో​ తెలంగాణ ప్రజాభవన్​గా మారుస్తాం'
Kishan Reddy: ' ప్రగతిభవన్​ను భవిష్యత్​లో​ తెలంగాణ ప్రజాభవన్​గా మారుస్తాం'

By

Published : Apr 23, 2022, 5:40 PM IST

Kishan Reddy on pragathi bhavan: రాష్ట్రంలో తెరాస నేతల ఆగడాలు పెరిగిపోయాయని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమని వెల్లడించారు. తెరాస నాయకులు ఆందోళన చేస్తే లేని ఇబ్బంది.. భాజపా కార్యకర్తలు చేస్తే ఎందుకు వేస్తోందని ప్రశ్నించారు. కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. సాయి గణేష్‌ ఓ సాధారణ కారు డ్రైవరని.. తన అమ్మమ్మ వద్ద ఉంటారని, నెలలో 15 రోజులు భాజపా కోసం పనిచేస్తారని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి వెల్లడించారు. పోలీసులు సాయి గణేష్‌పై 16 కేసులు పెట్టారని.. 3 సార్లు జైలుకు పంపించి రౌడీషీట్​ తెరిచి వేధించారని ఆయన తెలిపారు. ఖమ్మంలో కేటీఆర్‌ పర్యటన ఉంటే మూడ్రోజుల ముందే సాయి గణేష్‌ను పోలీసులు పీఎస్‌లో నిర్బంధించారన్నారు. పెళ్లి ఉందన్నా వినకుండా సాయి గణేష్‌ను పోలీసులు వదలలేదని.. దీంతో మనస్తాపం చెంది పోలీస్​ స్టేషన్​ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస నేత వేధింపులకు ఖమ్మంలో ఓ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుందని విమర్శించారు. మెదక్‌, కామారెడ్డిలోనూ తెరాస ఆగడాలకు వ్యక్తులు బలి అయ్యారన్నారు.

దౌర్జన్యాలు చేస్తోంది: ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసే వారిపై రాష్ట్ర సర్కారు దౌర్జన్యాలు చేస్తోందని మండిపడ్డారు. 'తెరాస నేతలు ప్రధాని దిష్టిబొమ్మను తగలబెడతారు.. అదే మేము చేస్తే నిర్బంధిస్తారా? అంటూ ప్రశ్నించారు. కేంద్రంపై తెరాస నేతలు రోజూ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని' దుయ్యబట్టారు. కేంద్రంపై తెరాస నేతలు రోజూ బురద జల్లుతున్నారన్నారు. తెరాస ప్రభుత్వం అభివృద్ధి కోసం గజ్వేల్‌, సిరిసిల్లకు ఎంతిచ్చారు.. దుబ్బాకకు ఎంతిచ్చారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.

మీటర్లు పెట్టాలని ఎవరూ చెప్పలేదు: పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజలకు వైద్యం కోసం ఆస్పత్రులు ఏర్పాటు చేశామని, జాతీయ రహదారులు వేశామన్న కేంద్ర మంత్రి.. రాష్ట్రంపై ఏ విధంగా వివక్ష చూపెట్టామో చెప్పాలని తెరాస నేతలను ప్రశ్నించారు. రోడ్ల శంకుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని గత కొన్ని నెలలుగా అడుగుతున్నామని.. వారి ఆలస్యం వల్లే ఈ నెల 29న ఆ కార్యక్రమం చేపట్టనున్నామని ఆయన తెలిపారు. ఎంఎంటీఎస్​ ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇవ్వాలని అడిగితే ఇప్పటివరకు అతీగతి లేదన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్​ ఏర్పాటు చేస్తామంటే రాష్ట్ర సర్కారు ముందుకు రాలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అభద్రతాభావంతో ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. భాజపా, నరేంద్ర మోదీని ఏ విధంగా తిట్టాలనే కేసీఆర్​ కుటుంబం ఆలోచిస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్ల వద్ద మీటర్లు చెప్పాలని ఎవరూ అనలేదన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందన్నారు.

చివరి గింజవరకు కొనుగోలు చేస్తాం: గత 8 సంవత్సరాలుగా ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో.. రాష్ట్ర సర్కారు ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి సవాల్​ విసిరారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్ర సర్కారు 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. భాజపా సర్కారు దేశానికంతటికీ ఒకే పాలసీని తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ కేరళలో కూడా బాయిల్డ్​ రైస్​ ఎవరూ తీసుకోవడం లేదని.. రా రైస్​ మాత్రం ఎంతైనా తీసుకుంటామన్నారు. పేదప్రజలకు ఫోర్టిఫైడ్​ రైస్​ అందాలనే గొప్ప ఉద్దేశంతో భాజపా సర్కారు యత్నిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు ఒప్పందంపై సంతకం పెట్టింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. మెడపై కత్తి పెడితే సంతకం పెట్టామని అంటున్నారని.. అసలు వారి మెడపై వేలు కూడా పెట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం రైతుల నుంచి చివరి గింజవరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య ఒక్క తెలంగాణలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లడమే రాష్ట్ర సర్కారు పని అని ఆయన మండిపడ్డారు.

దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు: దేశంలో ఖర్చు చేసే ప్రతి పైసాకు కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉందన్నారు. ఏ రాష్ట్రమైనా తమకు ఒక్కటేనన్నారు. ఇటీవల గుజరాత్​ గురించి తెరాస నేతలు మాట్లాడుతున్నారన్నారు. దేశం కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గవర్నర్​ గురించి పట్టించుకునే సంప్రదాయం ఈ రాష్ట్రంలో లేదని కేంద్ర మంత్రి మండిపడ్డారు. జాతరకు వెళ్తే కూడా ప్రొటోకాల్​ పాటించని దుస్థితి ఇక్కడ ఉందన్నారు. అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగం లేకుండా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ అనే గౌరవం లేకుండా మంత్రులతో తిట్టించారని విమర్శించారు. అనేక ముఖ్యమంత్రులు వచ్చారు.. పోయారని.. కానీ ఇంత దిగజారుడు రాజకీయం ఏ సీఎం చేయలేదన్నారు.

చర్చకు సిద్ధమా?: రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ గౌరవాన్నే పెంచుకున్నారని.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తగ్గించారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో సెక్రటేరియట్​కు రాకుండా ఉండడం ప్రజాస్వామ్యమా? అంటూ మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలోని పలు విషయాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి సవాల్​ విసిరారు. ఇప్పుడు ప్రగతిభవన్​ కల్వకుంట్ల ప్రగతిభవన్​గా ఉందని.. దానిని భవిష్యత్​లో​ తెలంగాణ ప్రజాభవన్​గా మారుస్తామని కిషన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తామని అన్నారు. ప్రజలు ఆ దిశగా ఆశీర్వదించాలని కోరారు.

ఆగడాలకు బలయ్యారు: సాయి గణేష్‌ సాధారణ కారు డ్రైవర్‌. తన అమ్మమ్మ వద్ద ఉంటారు. సాయి గణేష్‌ నెలలో 15 రోజులు భాజపా కోసం పనిచేస్తారు. అతనిపై 16 కేసులు పెట్టారు.. 3 సార్లు జైలుకు పంపించారు. సాయి గణేష్‌పై రౌడీషీట్‌ తెరిచారు.. పోలీసులు వేధించారు. ఖమ్మంలో కేటీఆర్‌ పర్యటన ఉంటే మూడ్రోజుల ముందే సాయి గణేష్‌ను పోలీసులు పీఎస్‌లో నిర్బంధించారు. పెళ్లి ఉందన్నా వినకుండా సాయి గణేష్‌ను పోలీసులు వదలలేదు. అందుకే మనస్తాపంతో పోలీస్​ స్టేషన్​ మందు పురుగుల మందు తాగాడు. ఖమ్మం, మెదక్‌, కామారెడ్డిలోనూ తెరాస ఆగడాలకు వ్యక్తులు బలయ్యారు. -కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

' ప్రగతిభవన్​ను భవిష్యత్​లో​ తెలంగాణ ప్రజాభవన్​గా మారుస్తాం'

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details