తెలంగాణ ప్రకృతి పండుగ, పూలను కొలిచే సాంస్కృతిక వేడుక రాష్ట్రవ్యాప్తంగా సంబరంగా సాగుతోంది. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణం.. బతుకమ్మ పాటలు, డప్పుల చప్పుళ్లు, మహిళలు, యువతుల నృత్యాలతో మార్మోగింది. ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ పలు సంస్థలు సైకిల్ బతుకమ్మ నిర్వహించాయి.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి
హైదరాబాద్ ముషీరాబాద్ మున్సిపల్ ప్లే గ్రౌండ్‌లో కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని.. కోలాటం ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. వచ్చే ఏడాది బతుకమ్మ వేడుకలను దిల్లీలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. బోరబండలో కిలోమీటరు పరిధిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వేడుకల్లో పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు.
హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆడపడుచులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దంపతులు.. సంబరాల్లో పాల్గొన్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావు అధికార నివాసంలో.. తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అతివలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ ఆడి పాడారు. హనుమకొండలో మాజీ మేయర్ స్వర్ణ ఆధ్వర్యంలో కోలాటమాడుతూ మహిళలు సందడిచేశారు. కుమురం భీం జిల్లా సిర్పూర్‌లో పసుపుకొమ్ములతో బతుకమ్మ పేర్చి మహిళలు వేడుక చేసుకున్నారు.
ఇదీ చూడండి:Bathukamma DAY-4: నాలుగో రోజు'నానబియ్యం బతుకమ్మ'.. ఎలా చేయాలంటే?