Kishanreddy on Secunderabad Fire Accident: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ అగ్నిప్రమాదస్థలిని పరిశీలించారు. అగ్నిప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డెక్కన్ నిట్‌వేర్ ఘటనలో మంటల ధాటికి పక్కనే కాలనీలో దెబ్బతిన్న ఇళ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా సహాయ శిబిరంలో ఉన్న స్థానిక ప్రజలతో మాట్లాడారు.
వారిని ప్రభుత్వం ఆదుకోవాలి : అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎవరూ చనిపోయినట్లు గుర్తించలేదన్న కేంద్ర మంత్రి... జనావాసాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో నిర్వహిస్తున్న వేర్‌హౌజ్‌లు, గోడౌన్లపై సమగ్ర సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని నగరం వెలుపలికి తరలించాలన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరూ చనిపోయినట్లు గుర్తించలేదని, మంటల ధాటికి కాలనీలో దెబ్బతిన్న జనావాసాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
సికింద్రాబాద్ డెక్కన్ నిట్‌వేర్ అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనంలో దాదాపు 12 గంటల పాటు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి భవనం పూర్తిగా దెబ్బతిన్నది. లోపలికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మంటలను ఆర్పేక్రమంలో ఏడీఎఫ్‌వో ధనుంజయరెడ్డి, ఫైరింజన్ డ్రైవర్ నర్సింగరావు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు వీరిద్దరినీ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.